యూత్ సినిమా అంటే ఏమిటి, డైరక్టర్ గా ధనుష్ కు కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఆయన యూత్ లో ఉన్నప్పటి ఐడియాలా లేక ఇప్పటి యూత్ ని రిప్రజెంట్ చేసే ఐడియాలా అనేది ఈ సినిమా క్లారిటీ ఇస్తుంది. తన మేనల్లుడుని హీరోగా పరిచయం చేస్తూ తను దర్శకుడుగా కెమెరా వెనక నిలిచి చేసిన ఈ లైటర్ వీన్ రొమాంటిక్ కామెడీ ప్రయత్నం ఏ మేరకు సక్సెస్ అయ్యింది. అసలు సినిమా కథ ఏమిటి, యూత్ కు ఈ సినిమా పడుతుందా వంటి విషయాలు చూద్దాం.
స్టోరీ లైన్
ఈ సినిమా టీనేజ్ లో ఉన్న ఓ అమ్మాయి, అబ్బాయి ప్రేమ కథ. అబ్బాయి ప్రభు (పావిష్) ఓ చెఫ్, అమ్మాయి నీల (అనికా సురేంద్రన్) ఓ ఫుడీ. ఆమె అతన్ని చూస్తుంది. అతను ఆమెను చూస్తాడు. ఇద్దరు ప్రేమలో పడ్డారని అర్దం చేసుకుంటారు. అయితే ఓ ప్రత్యేకమైన కారణంతో వీళ్లకు బ్రేకప్ అవుతుంది. ఎవరి జీవితంలోకి వాళ్లు వెళ్లిపోతారు. ఆ తర్వాత ఆ కుర్రాడి జీవితంలోకి మరో అమ్మాయి (ప్రియా ప్రకాష్ వారియర్) వస్తుంది. ఆమెను ఓ పెళ్లి చూపుల్లో చూస్తాడు. చిన్నప్పటి క్లాస్ మేట్స్ ని అర్దం చేసుకుని ఇద్దరూ పెళ్లి చేసుకుని సెటిల్ అయ్యిపోదామనుకుంటారు.
అయితే ఈ లోగా ఈ కుర్రాడి బ్రేకప్ లవర్ నీల కు పెళ్లి అని తెలుస్తుంది. కొన్ని తప్పనిసరి పరిస్దితుల్లో ఆ పెళ్లికి వెళ్తాడు. అప్పుడు ఏం జరిగింది. పాత ప్రేమ కథ ఇద్దరికి గుర్తు వచ్చిందా, మళ్లీ ఇద్దరు ఒకటయ్యే సిట్యువేషన్స్ క్రియేట్ అయ్యాయా, ఇప్పుడు ఈ కొత్త అమ్మాయి పరిస్దితి ఏమిటి, అలాగే డెస్టినేషన్ వెడ్డింగ్‌లో పరిచయమైన అంజలి (రమ్య రంగనాథన్) ఈ కథలో ఏ పాత్ర పోషించి మలుపు తిప్పింది? ఫైనల్ గా నీలా పెళ్లి ఎవరితో జరిగింది అన్నది ఈ కథ.
ఎనాలసిస్
ఈ సినిమాకు ట్యాగ్ లైన్ “A usual love story.”. దాంతో ఇలా ట్యాగ్ లైన్ పెట్టారంటే డిఫరెంట్ కథ,కథనంతో సినిమా సాగుతుందని అనుకుంటాము. అయితే అలాంటిదేమీ ఉండదు. ట్యాగ్ లైన్ కు పూర్తి న్యాయం చేస్తూ సాగుతుంది. సినిమా స్టోరీ లైన్ నుంచి సీన్స్, డైలాగ్స్ అన్ని ప్రెడిక్టుబుల్ గానే సాగుతాయి. అయితే యూత్ కు ఇది చాల్లే అని డైరక్టర్ ఫిక్సైనట్లున్నాడు. కానీ యూత్ మాత్రమే ఈ సినిమా చూస్తారనే నమ్మకం అయితే లేదు కదా.
ఓ రకంగా ఈ సినిమా 2000 నాటి ప్రేమలను గుర్తు చేస్తుంది. క్యారక్టర్ ఆర్క్ లు అలాగే ఉంటాయి. అయితే సినిమా పూర్తిగా ఎంటర్టైన్మెంట్ ధోరణిలో నడవటం మాత్రం ప్లస్ అయ్యింది. సినిమా పూర్తైన తర్వాత ఒకటే మనకు అనిపిస్తుంది లీడ్ క్యారక్టర్స్ ఇద్దరూ కూర్చుని మాట్లాడుకుంటే సరిపోయేది కదా అని. ఇరవైల్లో ఉన్న యూత్ ఇలాగే ఉన్నారని డైరక్టర్ గా ధనుష్ ఫిక్సై ఉండచ్చు కానీ కాస్త బయిట ప్రపంచాన్ని గ్రౌండ్ లెవిల్ లో రీసెర్చ్ చేసి చూస్తే బాగుండేది. ఎందుకంటే ఈ జనరేషన్ యూత్ సమస్యలు వేరు. వాటి పరిష్కారాలు వేరు కాబట్టి.
టెక్నికల్ గా
ధనుష్ మంచి టెక్నికల్ క్రూ ఉంది, మంచి టెక్నికల్ నాలెడ్జ్ ఉంది. అయితేనేం డబ్బింగ్ తమిళంలోనూ సరిగ్గా కుదరలేదనే చెప్తున్నారు. తెలుగు అలాగే ఉంది. లిప్ సింక్ మేచవలేదు. ఈ విషయంలో టీమ్ ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సింది. ఎందుకంటే ఇదే ప్రధానం కదా. పాత కథను కొత్త వాళ్లనే చెప్తున్నాం కదా కొత్తగా ఫీలవుతారు ప్రేక్షకులు అని ధనుష్ ఫీలైనట్లున్నారు. అయితే ఫిల్మ్ మేకర్ గా ధనుష్ కు వంకపెట్టడానికి లేదు. అయితే ఎంతవరకూ టార్గెట్ యంగ్ ఆడియన్స్ ని చేరుతుందో చూడాలి.
ఇక తెలుగు డబ్బింగ్ బాగుంది. జీవీ ప్రకాష్ సంగీతం లో ఓ పాట పెద్ద హిట్. ఆర్డ్ డిపార్టమెంట్, ఎడిటింగ్ బాగా పనిచేసారు. హీరోగా పరిచయం అయిన ధనుష్ మేనల్లుడు పవీష్ బోయ్ ఎట్ నెక్ట్స్ డోర్ లాగ ఉన్నాడు. అయితే తన మేనమామను అనుకరిస్తున్నాడు. అందులోంచి బయిటకు రావాలి. ‘నీల’గా అనికా సురేంద్రన్ బ్యూటిఫుల్ గా ఉంది. హీరో ఫ్రెండ్ రాజేష్‌గా మాథ్యూ థామస్ ఫన్ సినిమాకు హైలెట్.
చూడచ్చా
ఈ సినిమా సాధారణమైన guy-meets-girl లవ్ స్టోరీ. అయితే Gen-Z యాంగిల్ లో చెప్పే ప్రయత్నం చేసారు. ఇదేమీ ప్రయోగం కాదు. ఈ వీకెండ్ సరదాగా ఏ మాత్రం బుర్రకి పని పెట్టని లైటర్ వీన్ సినిమాగా దీన్ని చూడచ్చు. రిలాక్స్ అవ్వచ్చు. ధనుష్ ట్రైలర్ లో చెప్పినట్లు జాలీగా రండి.. జాలీగా వెళ్లండి!!