‘కుమ్కి’, ‘జిగర్తండా’ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన మలయాళ నటి లక్ష్మీ మేనన్ (Lakshmi Menon) కు కేరళ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. సెప్టెంబర్ 17 వరకు ఆమెను అరెస్ట్ చేయరాదని కోర్టు ఆదేశించింది.
ఈ కేసు చిత్రంగా అనిపిస్తున్న కారణంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఐటీ ప్రొఫెషనల్‌ను కిడ్నాప్ చేసినట్లు లక్ష్మీ మేనన్ పై ఆరోపణలు వచ్చాయి. కొచ్చిలో ఓ ఐటీ ఉద్యోగిని స్నేహితులతో కలిసి కిడ్నాప్ చేసి, అతడిపై దాడి చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆ ముగ్గురిని అరెస్టు చేయగా.. నిందితుల్లో ఒకరిగా ఉన్న నటి పరారీలో ఉందని కొచ్చి నగర పోలీస్ కమిషనర్ విమలాదిత్య తెలిపారు. ఆమె కోసం గాలింపు చర్యలు చేపట్టామన్నారు. అయితే, ఆమె పేరును ఎఫ్‌ఐఆర్‌లో ఇంకా చేర్చలేదని సమాచారం.
కొచ్చిలోని ఒక పబ్‌లో లక్ష్మి మేనన్ స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు గొడవ తలెత్తింది. అక్కడితో ఆ గొడవ సద్దుమణగకపోవడంతో.. సదరు ఎంప్లాయిని నటి, ఆమె స్నేహితులు వెంబడించారు. అతడి కారును అడ్డగించి, బలవంతంగా తమ కారులోకి ఎక్కించి, దాడి చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో బయటకొచ్చి సంచలనం రేపింది.
లక్ష్మీ మేనన్ నేరుగా తెలుగులో సినిమాలు చేయకపోయినా, ‘గజరాజు’, ‘ఇంద్రుడు’, ‘చంద్రముఖి 2’, ‘శబ్దం’ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ఆడియన్స్‌ను ఆకట్టుకుంది .. ఒక దశలో నటుడు విశాల్‌తో ఆమె పేరు లింక్ అయ్యిందనే వార్తలు వినిపించినా, అవి తర్వాత నిరాధారమని తేలాయి.