హిందూపురంలోని శ్రీ వాసవీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో వార్షికోత్సవాలు వైభవంగా నిర్వహించబడ్డాయి. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠకు 85 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా ఈ వేడుకలను అట్టహాసంగా జరిపారు.
ఈ ప్రత్యేక సందర్బంగా, రెండు కేజీలు 300 గ్రాముల బంగారంతో తయారైన కొత్త వాసవీ దేవి విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ విగ్రహ నిర్మాణానికి దాదాపు రూ. 3 కోట్ల వ్యయం అయినట్టు నిర్వాహకులు తెలిపారు.
ఈ స్వర్ణ విగ్రహాన్ని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన సతీమణితో కలిసి ఆవిష్కరించారు. అనంతరం అమ్మవారికి బంగారు పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్యక్రమానంతరం, బాలకృష్ణ దంపతులను ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఘనంగా సన్మానించారు. ఇదిలా ఉంటే, కొత్త బంగారు విగ్రహం దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. భక్తుల రద్దీతో ఆలయం పుణ్యక్షేత్రంలా మారింది.