సినిమా వార్తలు

ఆది ‘శంభాల’కు స్ట్రాంగ్ థియేట్రికల్ డీల్స్! షాక్ లో ట్రేడ్

ఆది సాయికుమార్ ప్రతిభపై ఎవరికీ సందేహం లేదు. కానీ నిజం చెప్పాలంటే… ఇప్పటివరకు అతని కెరీర్ ఆశించిన స్థాయిలో క్లిక్ కాలేదు. మంచి నటుడు, స్క్రీన్‌పై నిజాయితీగా ట్రై చేసే ఆర్టిస్ట్ అయినప్పటికీ, ఒక్క బలమైన బ్రేక్ మాత్రం ఇంకా దూరంగానే ఉంది. అదే బ్రేక్ కోసం ఆది చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే—జానర్ పరంగా రిస్క్ తీసుకుంటూ, రూటిన్‌కు భిన్నమైన సినిమాలు చేయడం. ఈ క్రమంలోనే ఇప్పుడు అతను ప్రేక్షకులను ఓ మిస్టికల్ ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు సిద్ధమవుతున్న సినిమా ‘శంభాల’ .

ఈ క్రిస్మస్‌కు థియేటర్లలోకి రాబోతున్న ‘శంభాల’పై ట్రేడ్‌లో బజ్ మెల్లగా పెరుగుతోంది. ఉగంధర్ ముని దర్శకత్వంలో, రాజశేఖర్ అన్నభిమోజు – మహిధర్ రెడ్డి నిర్మించిన ఈ ఫాంటసీ–సూపర్‌నేచురల్ థ్రిల్లర్‌కు సంబంధించి తాజాగా కీలక అప్డేట్ బయటికి వచ్చింది. సినిమా థియేట్రికల్ డీల్స్ బలంగా క్లోజ్ కావడం ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

ఇప్పటికే నాన్–థియేట్రికల్ హక్కులు మంచి రేట్లకే అమ్ముడుపోగా, తాజాగా ప్రధాన ప్రాంతాల థియేట్రికల్ హక్కులను కూడా ప్రముఖ డిస్ట్రిబ్యూటర్లు సొంతం చేసుకున్నారు.
ఆంధ్రా & సీడెడ్ హక్కులను ఉషా పిక్చర్స్ దక్కించుకోగా,
నైజాం ప్రాంతాన్ని మైత్రీ డిస్ట్రిబ్యూటర్స్ తీసుకున్నారు.
ఓవర్సీస్ హక్కులు మూన్‌షైన్ సినిమాస్ సొంతమయ్యాయి.
ఇక కర్ణాటక హక్కులను కుమార్ బెంగళూరు ఫిలిమ్స్ దక్కించుకోవడం విశేషం.

డీల్స్ చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతోంది—‘శంభాల’పై ట్రేడ్‌లో నమ్మకం ఉంది. కంటెంట్ మీద కాన్ఫిడెన్స్ లేకపోతే ఇలాంటి సెటిల్డ్ డీల్స్ సాధ్యం కావు. డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధమవుతున్న ఈ సినిమాలో ఆది సాయికుమార్‌తో పాటు అర్చనా అయ్యర్, స్వాసిక, రవి వర్మ, హైపర్ ఆది, మధునందన్, శివ కార్తిక్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఇప్పటి వరకు “మంచి నటుడు కానీ లక్ కలిసి రాలేదు” అన్న ట్యాగ్‌తో ఉన్న ఆది కెరీర్‌కు… ‘శంభాల’ నిజంగా ఆ మిస్సింగ్ బ్రేక్ ఇవ్వగలదా?

ఈ క్రిస్మస్‌కు థియేటర్లలో దానికి సమాధానం దొరకబోతోంది.

Similar Posts