
హైదరాబాద్‌లో 360 కోట్ల రూపాయల సాహితీ ఇన్‌ఫ్రా మోసం కేసులో తెలుగు సినీ నటుడు జగపతిబాబును ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం దాదాపు నాలుగు గంటల పాటు విచారించారు. సాహితీ సంస్థ తరఫున ఆయన పలు ప్రాజెక్టుల ప్రమోషన్లలో పాల్గొనడం, అలాగే ఆయనకు చెల్లించిన రెమ్యునరేషన్ అంశాలపై ఈడీ అధికారులు ప్రశ్నలు అడిగారు.
సాహితీ ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SIVIPL) సంస్థ ప్రీలాంచింగ్ ఆఫర్ల పేరుతో వందలాది మందిని మోసం చేసి, బుకింగ్స్ పేరుతో తీసుకున్న డబ్బును వేరే ఖాతాలకు మళ్లించినట్టు ఈడీ దర్యాప్తులో బయటపడింది. ఇప్పటికే 700 మందికి పైగా ఫిర్యాదులు చేశారు.
ఈ కేసులో మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావు, మేనేజింగ్ డైరెక్టర్ బి.లక్ష్మీనారాయణను ఈడీ అధికారులు గతంలోనే అరెస్టు చేశారు. ఇప్పటివరకు రూ.161.5 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు.
జగపతిబాబు హాజరైన విచారణలో, ఆయన చేసిన ప్రమోషన్లపై, పొందిన పారితోషికం చట్టబద్ధతపై అధికారులు వివరణ కోరారు. అంతేకాకుండా గత 15 ఏళ్ల బ్యాంక్ స్టేట్‌మెంట్స్ సమర్పించాలని కూడా సూచించారు.
