మహా కుంభమేళాకు బాలీవుడ్ స్టార్ కబీర్ ఖాన్ వెళ్లడం డిస్కషన్ టాపిక్ అయ్యింది. కబీర్ ఖాన్ మంగళవారం ఉదయం ప్రయాగ్ రాజ్ చేరుకున్నారు. తాను మహా కుంభమేళాలో భాగం కావాలని అనుకున్నానని, త్రివేణి సంగమంలో పుణ్య సనం చేయడానికి వచ్చానని న్యూస్ ఏజెన్సీతో తెలిపారు.
”మహా కుంభమేళాకు ప్రజలు తండోప తండాలుగా వస్తున్నారని విన్నాను. ఎలా ఉంటుందో చూడాలి. ఇక్కడికి రావడం అదృష్టంగా భావిస్తున్నాను. కొన్ని రోజులు మహా కుంభమేళాలోనే ఉంటాను” అని చెప్పారు.
ముస్లిం అయ్యి ఉండి మహా కుంభమేళాకు రావడం ఏమిటి? అనే మీడియా ప్రశ్నలకు కూడా కబీర్ ఖాన్ సమాధానం ఇచ్చారు.
”ఇటువంటివి (మహా కుంభమేళాను ఉద్దేశిస్తూ…) హిందువుల గురించో, ముస్లింల గురించో కాదు. మన దేశ మూలాలకు సంబంధించినవి, మన నాగరికతకు సంబంధించినవి. ఇందులో ముస్లిం, హిందూ అనే ప్రశ్నకు తావు లేదు. ‘నేను భారతీయుడిని’ అని మీరు నమ్మితే అంతా మనదే అని కబీర్ ఖాన్ చెప్పారు.
సల్మాన్ హీరోగా ‘బజరంగీ భాయిజాన్’, ‘ఏక్ థా టైగర్’ సినిమాలతో పాటు సైఫ్ అలీ ఖాన్, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘న్యూయార్క్’, రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో 1983లో టీమిండియా క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన నేపథ్యంలో రూపొందించిన ’83’, ఇంకా కార్తీక్ ఆర్యన్ ‘చందు ఛాంపియన్’ వంటి సినిమాలకు కబీర్ ఖాన్ దర్శకత్వం వహించారు.