గత కొద్ది రోజులుగా మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి క్యాన్సర్‌తో బాధపడుతున్నారని కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. అందుకే సినిమాలకు దూరంగా ఉన్నారంటూ మీడియాలో గుప్పుమంది. ఈ నేపథ్యంలో ఆయన టీమ్ అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ఫేక్ న్యూస్ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆయన సెలవుల్లో ఉన్నారని తెలిపింది. రంజాన్ కోసం ఉపవాసంలో ఉన్నారని పేర్కొంది. త్వరలోనే తిరిగి సినిమాల్లో నటిస్తారని వెల్లడించింది.
మమ్ముట్టి టీమ్ తమ ప్రకటనలో ఏమని చెప్పుకొచ్చారంటే.. ‘ఆయన ప్రస్తుతం రంజాన్ ఉపవాసం ఉన్నందున సెలవుల్లో ఉన్నారు. ఆ కారణంతోనే అతను తన షూట్ షెడ్యూల్ నుంచి కూడా విరామం తీసుకున్నారు. విరామం తర్వాత మోహన్ లాల్- మహేష్ నారాయణన్ సినిమా షూటింగ్‌కి తిరిగి వెళ్తారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ ఫేక్ న్యూస్” అని స్పష్టం చేశారు.
కాగా.. మమ్ముట్టి, మోహన్‌లాల్‌లు నటిస్తోన్న మహేష్ నారాయణన్ సినిమా మొదటి షెడ్యూల్ శ్రీలంకలో ప్రారంభమైంది. ఈ మల్టీస్టారర్ మలయాళ చిత్రంలో ఇద్దరు పెద్ద స్టార్స్ మమ్ముట్టి, మోహన్‌లాల్ నటిస్తున్నారు. ఈ మూవీకి తాత్కాలికంగా ఎంఎంఎంఎన్ (మమ్ముట్టి, మోహన్‌లాల్, మహేష్ నారాయణన్) అని వర్కింగ్ టైటిల్ పెట్టారు.
ఈ చిత్రంలో ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, నయనతార, దర్శనా రాజేంద్రన్ కూడా నటిస్తున్నారు. కాగా.. మమ్ముట్టి చివరిగా గౌతమ్ వాసుదేవ్ మీనన్ తెరకెక్కించిన కామెడీ చిత్రం డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్‌లో కనిపించారు. ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 23న విడుదలైంది. బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది.