విశాఖ వీధుల్లో ట్యాక్సీ డ్రైవ్ చేస్తూ లైఫ్ లాగుతూంటాడు నారాయణరావు (నరేష్). అతనికి తన కూతురు అలేఖ్య (నీలఖి) అంటే ప్రాణం. అయితే ఆమె మాత్రం కుటుంబ పరిస్దితిని పట్టించుకునేంత ఇంకా ఎదగలేదు. ఎదిగినా అవసరం లేదనుకునే మెంటాలిటీ. దాంతో తమ మిడిల్ క్లాస్ తల్లి,తండ్రులు తీర్చగలుగుతారా లేదా అనేది కూడా ఆలోచించకుండా కోరికలు కోరుతుంది. ఆమె కోరికలు తీర్చటానికి శాయశక్తులా ప్రయత్నిస్తూంటాడు ఆ తండ్రి. ఆ క్రమంలో పుట్టిన రోజుకి ఆ కూతురు గిప్ట్ గా ఓ స్కూటీ అడుగుతుంది. చేతులో పైసా లేకపోవటంతో తల తాకట్టు పెట్టి ఓ బైక్ కొని పెడతాడు ఆ తండ్రి.

కానీ ఆ కూతురి ఆ స్కూటీతో వేరే ప్రయాణం మొదలెట్టింది. ఆ ప్రయాణం వేరే ట్రాక్‌లోకి వెళ్లటం మొదలైంది. ఆమె జీవితంలోకి అర్జున్ (అంకిత్ కొయ్య) అనే బాయ్ ఎంట్రీ ఇచ్చాడు. మొదట ఫైట్… తర్వాత ఫ్రెండ్‌షిప్… అక్కడి నుంచి స్ట్రైట్ లవ్ తో ఎంట్రీ ఇస్తాడు! ఆ ప్రేమ ముదిరి పాకాన పడుతుంది. దాంతో తమ ప్రేమ విషయం తమ పేరెంట్స్‌కి ఎక్కడ తెలిసిపోతుందో అనే టెన్షన్‌ పడుతుంది.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా దొరికిపోయే సమయం అది. ఓ రోజు బోయ్ ప్రెండ్ కు ఓ వీడియో కాల్ చేసి అందాల ప్రదర్శనతో రచ్చ చేస్తుంది. అయితే అనుకోకుండా ఆమె తన తల్లికి దొరికిపోతుంది. దాంతో అలేఖ్య తన తల్లి, తండ్రి ఏం నిర్ణయం తీసుకుంటారా అనే భయపడుతుంది. అర్జున్‌ను ఒప్పించి హైదరాబాద్ కు లేచిపోయే ప్లాన్ చేస్తుంది.

అయితే ఆ విషయం తెలిసిన ఆ తండ్రి “నా బిడ్డను సిటీ మింగేస్తుందేమో అన్న టెన్షన్‌తో హైదరాబాదు చేరుకుని వెతకడం మొదలెడతాడు. మరో ప్రక్క వైజాగ్ నుంచి అమ్మాయిలను ట్రాప్ చేసి, అనుభవించి వీడియో లు చేసి బ్లాక్ మెయిల్ చేసే క్రిమినల్ ఒకరు ఈ జంట వెనకే హైదరాబాద్ వెళ్తాడు. అయితే ఆ క్రమంలో అనుకోని ఓ ట్విస్ట్ ఎదురౌ కథ మొత్తం మార్చేస్తుంది. అదేమిటి..చివరకు నారాయణరావు తన కూతురిని కనుక్కోగలడా? అలేఖ్య ప్రేమ కథ ఏ తీరానికి చేరింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ స్టోరీలో లవ్ ఉంది. ఫ్యామిలీ ఎమోషన్ ఉంది. రియల్ లైఫ్ షాక్ ఉంది. ఒక చిన్న తప్పు… లైఫ్ మొత్తాన్ని తలకిందులు చేయగలదు అనే పాఠం ఉంది . మొత్తం మీద – ఇది ఒక డాడీ-డాటర్ ఎమోషనల్ రోలర్‌కోస్టర్ ! . అయితే దాన్ని సినిమాటెక్ గా ప్రెజెంట్ చేయటంలో తడబాటు ఎదురైంది. ఫస్టాఫ్ బాగానే వెళ్లిపోయినా సెకండాఫ్ కు వచ్చేసరికి సినిమాలో తెలిసిన సీన్స్, రొటీన్ స్క్రీన్ ప్లే ఎదురౌతాయి. మళయాళ చిత్రం కప్పల్ (తెలుగులో బుట్టబొమ్మ) చూసిన వారు సినిమాలో హైలెట్ అనుకున్న ట్విస్ట్ ఎక్సపెక్ట్ చేసేయగలుగుతారు. అది నేరేషన్ కు ఓ పెద్ద ఇబ్బంది. దీనికి తోడు క్రైమ్, పోలీస్ ల మధ్య వచ్చే సీన్స్ ఆసక్తి కలిగించలేదు. అలాగే అప్పట్లో వచ్చిన ప్రేమిస్తే (భరత్) సినిమాని గుర్తు చేస్తూ హీరో,హీరోయిన్ మధ్య కొన్ని సీన్స్ నడుస్తాయి. దాంతో చాలా ప్రెడిక్టబుల్ గా మారుంది. దాంతో సెకండాఫ్ ని సరిగ్గా సర్దలేకపోయిన ఫీలింగ్ కలుగుతుంది.

అయినా ఎక్కడో ప్రీ క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంది. అప్పటి దాకా కథ,కథనం నడపాలి అని టార్గెట్ పెట్టుకుని సీన్స్ వేసుకుంటూ వెళ్ళే కథలకు ఎప్పుడూ సమస్యే. అందులోనూ ఇప్పటి జెన్ జీ ప్రేక్షకులు..ఎక్కడో క్లైమాక్స్ లో ఓ ట్విస్ట్ ఇస్తాను , అది మీ మైండ్ బ్లాక్ అవుతుంది అని చెప్తే అప్పటిదాకా ఖాళీగా కూర్చోరు. సెల్ ఫోన్ తీసుకుని ఆడుకోవటం మొదలెడతారు. అలా కాకుండా ఇంట్రవెల్ కు ఆ ట్విస్ట్ ప్రేక్షకులకు ఓపెన్ చేసి, సెకండాఫ్ లో క్యారక్టర్స్ కు ఎప్పుడు తెలుస్తుందనే ఓపెన్ డ్రామా పెడితే ఎంగేజింగ్ గా ఉండేది.

అయితే ఇలాంటి లోపాలు కొన్ని ఉన్నా తండ్రి ఎమోషన్ చేసిన ప్లే మాత్రం బాగా వర్కవుట్ అయ్యింది. అదే చాలావరకూ కాపాడింది. అదే డైరక్టర్ కోరుకున్న ఎఫెక్ట్ అయితే అతను సక్సెస్ అయ్యినట్లే.

ఎవరెలా చేసారు.

అంకిత్ కొయ్య బాగా చేసారు. కానీ హీరోయిన్ గా చేసిన నీలఖితో పోటీ పడలేకపోయాడు కొన్ని సీన్స్ లో. అంతబాగా చేసింది ఆ అమ్మాయి.ఆమెది ఇదే మొదట సినిమా అంటే నమ్మలేం. ఇలాగే మిడిల్ క్లాస్ తండ్రి పాత్ర‌లో న‌రేష్ త‌న అనుభ‌వంతో నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లాడు. వాసుకికి కూడా గుర్తుండిపోయే పాత్ర. మిగతా పాత్రలు అంత గుర్తుండేవి కాదు కానీ బాగానే చేసారు.

టెక్నికల్ గా

డైరక్టర్ ప్రత్యేకంగా స్పార్క్ కనపడలేదు కానీ, బాగా తీసారు. అలాగే సీన్స్ కూడా చాలా వరకూ ఇంటెన్స్ తో సాగాయి. కాకపోతే ఆ ఇంటెన్సిటీ కథ మొత్తానికి వర్తింప చేయలేకపోయారు. ఇక డైలాగులు ఇంకా బాగుండాలి. కెమెరా వర్క్, ఆర్ట్ వర్క్ బాగా సెట్ అయ్యాయి. మేకింగ్ ప‌రంగా మంచి మార్కులు పడతాయి. . విజ‌య్ బుల్గానిన్ పాట‌ల్లో ‘క‌న్న‌మ్మా’ బాగుంది.

చూడచ్చా

ఓ సారి చూడచ్చు.

ప్రేమ వయసు చూసుకోదు… కానీ ఫలితం మాత్రం వయసు తేడా లేకుండా లైఫ్ మొత్తాన్ని తలకిందులు చేస్తుంది. తండ్రి కూతురి కోసం చేసే త్యాగం, కూతురు తెలియని వయసులో చేసే పొరపాట్లు – ఎప్పుడూ మనకు పాఠాలే. ఈ స్టోరీ మనందరికీ ఒక మిర్రర్ లాంటిది.

లవ్ ట్రిప్ అనుకున్నది… ఎప్పుడు లైఫ్ ట్రాప్ అవుతుందో ఎవరికీ ముందే తెలియదనే విషయం గుర్తు చేస్తుంది.

, , , , , , ,
You may also like
Latest Posts from