చిరంజీవి చాలా సరదాగా మాట్లాడతారు. ఆయన మాటల్లో హాస్యం తొణికిసలాడుతుంటుంది. ఒక్కోసారి ఆయనపై ఆయనే జోకులు వేసుకుంటారు. తాజాగా రంగారెడ్డి జిల్లా ప్రొద్దుటూరులో ప్రపంచస్థాయి ఎకో ఫ్రెండ్లీ ఎక్సీపీరియం పార్కును సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రముఖ సినీనటుడు చిరంజీవి, ప్రభుత్వ విప్ మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ క్రమంలో చిరంజీవి మాట్లాడుతూ అక్కడ వారిని నవ్వించారు.
చిరంజీవి మాట్లాడుతూ.. ‘‘ ‘కొత్తగా మొక్కలు వచ్చాయి చూస్తారా’ అని రాం దేవ్ అడుగుతూ ఉంటారు. ఒకప్పుడు వాటి ధరలు వేలు, లక్షల్లో ఉండేవి. ఇప్పుడు కోట్లలో ఉంటున్నాయి. అసలే నా సంపాదన అంతంత మాత్రంగా ఉంది. (నవ్వులు) కొనలేనేమో అనిపించింది. గౌరవ ముఖ్యమంత్రిగారితో ఇక్కడకు వచ్చి, చూస్తే ఇవన్నీ కొనేయాలనిపిస్తోంది’’.
అలాగే ‘‘ ‘ఇది షూటింగ్స్‌కు ఇస్తారా రాందేవ్’ అని అడిగితే, ‘ఫస్ట్ మీ మూవీ షూట్ అయితే ఇస్తా’ అన్నారు రాందేవ్ . ఇప్పుడు కొత్త హీరోయిన్‌ను తీసుకొచ్చి స్టెప్పులు వేయాలంటే ఈ ఎండలో ఎలా ఉంటుందో. (నవ్వులు) వచ్చే శీతాకాలంలో చూద్దాం. ఈలోగా వర్షాలు పడి, మరింత పచ్చదనం పెరుగుతుంది. ఒకట్రెండు ఏళ్లలో కంటికి ఇంపుగా ఉంటుంది. ’’ అని చిరంజీవి నవ్వుతూ అన్నారు.
ప్రస్తుతం చిరంజీవి (Chiranjeevi) హీరోగా వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న సోషియో ఫాంటసీ ఫిల్మ్ ‘విశ్వంభర’ (Vishwambhara). త్రిష (Trisha) కథానాయిక. శరవేగంగా షూటింగ్ చేసుకుంటున్న ఈ సినిమా.
యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో ‘విశ్వంభర’ తీర్చిదిద్దుతున్నట్లు టాక్. సోషియో ఫాంటసీ మూవీ కావడంతో వీఎఫ్‌ఎక్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నట్లు తెలుస్తోంది.
చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ సినిమా కోసం 13 భారీ సెట్‌లతో ఓ ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించారు. ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త అవతారంలో చిరంజీవి కనిపించనున్నారు.