మోహన్ లాల్ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్‌‌‌‌‌‌‌‌’కు ఇది సీక్వెల్. పృథ్విరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేస్తుండటంతో పాటు కీలకపాత్ర పోషిస్తూండటంతో ప్రాజెక్టుపై క్రేజ్ బాగా పెరిగింది. దానికి తోడు తెలుగులో దిల్‌ రాజు భారీగా విడుదల చేశాడు. ఈ నేపధ్యంలో అభిమానులు మంచి పొలిటికల్ థ్రిల్లర్ చూడబోతున్నామనే ఫీల్ కలిగింది. మరి వారి అంచనాలను ఈ సీక్వెల్ అందుకుందా? ఎలాంటి టాక్ సొంతం చేసుకుందో పూర్తి రివ్యూలో తెలుసుకుందాం.

స్టోరీ లైన్

ఫస్ట్ ఫార్ట్ లో … లూసిఫర్ స్టీఫెన్‌ నడింపల్లి (మోహన్‌లాల్‌) తన తండ్రి పీకే రామదాస్‌ (సచిన్‌ ఖేడ్కర్‌) మరణానంతరం ఐయూఎఫ్‌ పార్టీలో చెలరేగిన అలజడులన్నింటినీ సద్దుమణిగేలా చేస్తాడు. ఆ తర్వాత తన తమ్ముడైన జతిన్‌ రామ్‌దాస్‌ ను (టోవినో థామస్) ముఖ్యమంత్రిని చేసి విదేశాలకు అజ్ఞాతంలోకి వెళ్లిపోతాడు. ఇప్పుడు అధికారం చేతికొచ్చాక జతిన్‌ రామ్‌దాస్‌ తన వక్రబుద్ధిని చూపెట్టడం మొదలెడతాడు.

సొంత ప్రయోజనాల కోసం దేశ రాజకీయాలను శాసిస్తున్న మతతత్వ వాది బాబా భజరంగి (అభిమన్యు సింగ్‌)తో కలిసి తాను పనిచేయబోతున్నామని ప్రకటిస్తారు. భజరంగి ఉద్దేశ్యం…జతిన్‌ను అడ్డం పెట్టుకుని కేరళలోని వనరులను కొల్లగొట్టాలని. అయితే జతిన్‌ నిర్ణయాన్ని అక్క ప్రియదర్శి (మంజు వారియర్‌)తో పాటు పీకేఆర్‌ పార్టీ సభ్యులు వ్యతిరేకిస్తారు.

వాళ్ళు చేపట్టిన అక్రమ పనులను ఆపడానికి సీఎంకి వ్యతిరేకంగా వెళ్తుంది. దీంతో ఆమెని చంపేందుకు జతిన్‌ ప్రయత్నిస్తాడు. ఇక అక్కడ రాజకీయ అల్లర్లు చెలరేగడం, పార్టీ అస్తవ్యస్తం అవ్వడం మొదలవ్వతుంది. అలాంటి పరిస్దితుల్లో లూసిఫర్ స్టీఫెన్‌ నడింపల్లి అవసరం ఏర్పడుతుంది. అయితే… ఇరాక్‌లో డ్రగ్ కార్టెల్ మీద జరిగిన దాడిలో స్టీఫెన్ చనిపోయాడని వార్తలు వస్తాయి.

అయితే నిజంగా స్టీఫెన్ నడుంపల్లి చనిపోయాడా? మళ్ళీ ఎలా తిరిగి వచ్చాడు. ఆయన కోసం వివిధ దేశాల గూఢచారి సంస్దలు ఎందుకు వెతుకుతున్నాయి. కేరళ తిరిగి వచ్చిన స్టీఫెన్ ఏం చేసాడు. సినిమాలో జయేద్ మసూద్ (పృథ్వీరాజ్ సుకుమారన్)పాత్ర ఏమిటి వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ

సినిమాకు వచ్చిన హైప్ కు అనుగుణంగా అయితే లేదు. పృథ్వీరాజ్ సుకుమార‌న్ గ్రిప్పింగ్‌గా స్టోరీని రాసుకోలేదు. వరసగా కొన్ని యాక్షన్ ఎపిసోడ్స్, కొన్ని బిల్డప్ షాట్స్ పెట్టుకుని ముందుకు వెళ్లిపోయాడు . స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌ ఉన్నాయి కానీ అవి ఆడియెన్స్‌కు ఏ మేరకు థ్రిల్ ఇస్తాయనేది అనుమానమే. అయితే మోహన్ లాల్ ఎంట్రీ సీన్ తో పాటు, ఇంటర్వెల్,క్లైమాక్స్ లో వచ్చే యాక్ష‌న్ సీక్వెన్స్‌లు హాలీవుడ్ స్టాండ‌ర్స్‌లో ఉన్నాయి. ఎంతసేపూ ఎలివేష‌న్లతో మరింత హై ఫీలింగ్ ఇచ్చేలా సినిమా డిజైన్ చేసారు.

సినిమా ప్రారంభమైన సరిగ్గా గంట వరకు మోహన్ లాల్ ఎంట్రీ ఉండదు. అది మళయాళం వాళ్లకు చెల్లుతుందేమో కానీ మనకు ఇంకా సినిమా ప్రారంభమే కాలేదేంటిరా అన్న ఫీలింగ్ వస్తుంది. ఫస్టాఫ్ లో ఉండాల్సిన డ్రామా సరిగ్గా సెట్ కాలేదు. దానితో పాటు ఎమోషన్స్ ఉన్నాయి కానీ అవి కనెక్ట్ చేయలేకపోయారు. కేవలం విజువల్స్ ని , ఫాస్ట్ పేసింగ్ ను నమ్ముకుని స్క్రిప్టుని ప్రక్కన పెట్టేసిన సినిమా ఇది. నాన్‌లీనియర్ ఫార్మాట్‌లో వరసపెట్టి ట్రైలర్‌లను కలిపి కుట్టేసిన అనుభూతిని ఇస్తుంది. లూసిఫర్ కు కలిసి వచ్చింది ఎమోషనల్ డెప్త్. ఈ సినిమాలో మిస్సైంది అదే.

టెక్నికల్ గా
ఈ సినిమా ప్రధాన మైనస్ .. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే రాసుకోకపోవటమే. విజువల్స్ తో మ్యాజిక్ చేయాలనుకోవటమే. వాస్తవానికి L2: ఎంపురాన్ అనేది మళయాళ పరిశ్రమ నుంచి వరల్డ్ క్లాస్ ప్రొడక్షన్. ప్యాన్ ఇండియా కాదు. ప్యాన్ వరల్డ్ లో కూడా ఈ విజువల్స్ కి వంక పెట్టేలేరు. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ. దీపక్ దేవ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఫస్టాఫ్ లో సోసోగా అనిపిస్తుంది.

ఇంటర్వెల్ తర్వాత మాత్రం ది బెస్ట్ ఇచ్చారు. యాక్షన్ కొరియోగ్రఫీ స్పెషల్ మెన్షన్. సినిమా మొదలైన గంట తర్వాత మోహన్ లాల్ ఎంట్రీ అదరకొట్టారు. ఆ సీన్స్ కంపోజ్ చేసిన విధానం బాగుంది. లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ పిక్చర్స్, శ్రీ గోకులం మూవీస్ నిర్మాణ విలువలు బాగున్నాయి.

నటీనటుల్లో..
మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ ఓ రేంజిలో ఉంది. అభిమన్యు సింగ్, మంజు వారియర్, టొవినో థామస్, ఫాజిల్, సూరజ్, కిశోర్ తదితరులంతా తమ అనుభవం రంగరించి పాత్రలను బాగానే పోషించారు.

చూడచ్చా

యాక్షన్ సినిమాల అభిమానులకు ఈ సినిమా బాగా నచ్చుతుంది. అలాగే మోహన్ లాల్ ని బాగా ఇష్టపడేవారికి కూడా ఎలివేషన్స్ అవీ బాగా నచ్చుతాయి.

నటీనటులు: మోహన్ లాల్, పృధ్వీరాజ్ సుకుమారన్, టొవినో థామస్, మంజు వారియర్, అభిమన్యు సింగ్, కిషోర్ తదితరులు..
కథ: మురళి గోపి
సినిమాటోగ్రఫీ: సుజీత్ వాసుదేవ్
సంగీతం: దీపక్ దేవ్
నిర్మాత: ఆంటోనీ పెరుంబవూర్, సుభాస్కరన్, గోకులం గోపాలన్
దర్శకత్వం: పృధ్వీరాజ్ సుకుమారన్
విడుదల తేదీ: మార్చి 27, 2025

, , , ,
You may also like
Latest Posts from