
పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ‘ఓజీ’ (OG) సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణలో కీలకమైన మలుపు చోటుచేసుకుంది. సోమవారం తెలంగాణ పోలీస్ శాఖ తాజాగా జారీ చేసిన జీవోలో, పెంచిన టికెట్ ధరలను వెంటనే రద్దు చేసి, సాధారణ రేట్లకే అమ్మాలని సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్ యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసింది.
అసలు విషయం ఏంటంటే—సినిమా విడుదలకు ముందు ప్రభుత్వం ప్రత్యేక అనుమతితో సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు అధిక ధరలకు టికెట్లు అమ్ముకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే, ఆ నిర్ణయాన్ని మహేశ్ యాదవ్ అనే వ్యక్తి సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ వేశారు. జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ ఇప్పటికే ఆ ఉత్తర్వులను సస్పెండ్ చేస్తూ కీలక ఆదేశాలు ఇచ్చారు.
తాజాగా డివిజన్ బెంచ్ కూడా టికెట్ ధరలు పెంచకూడదని స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణ అక్టోబర్ 9కి వాయిదా పడగా, “ప్రభుత్వం ఎందుకు ధరలు పెంచాలనుకుంటుంది?” అనే అంశంపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది.
ఇక ఫ్యాన్స్ ఆశించినట్టే ‘ఓజీ’ (OG) మార్నింగ్ షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రీమియర్స్‌లోనూ అత్యధిక వసూళ్లు (గ్రాస్) రాబట్టిన సినిమాగా ‘ఓజీ’ నిలిచింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కావడమే ఆలస్యం టికెట్లు అత్యంత వేగంగా అమ్ముడుపోయాయి. తొలిరోజు ఈ స్థాయి కలెక్షన్లు పవన్ కల్యాణ్ కెరీర్‌లోనే ఓ రికార్డు. ఫస్ట్ డే అత్యధిక వసూలు చేసిన టాప్-10 భారతీయ సినిమాల జాబితాలో ‘ఓజీ’ చోటు దక్కించుకుంది. ఆయా చిత్ర టీమ్ లు అధికారికంగా ప్రకటించిన తొలి రోజు కలెక్షన్స్ మేరకు.. టాలీవుడ్ నుంచి ఏడో చిత్రమిది.
తాను ఆరాధించే హీరోతో ఓ అభిమాని సినిమా తీస్తే ఎలా ఉంటుందో ‘ఓజీ’ మరోసారి రుజువు చేసింది. తనలాంటి ఎంతోమంది ఫ్యాన్స్ కొంతకాలంగా పవన్ సినిమాల్లో ఏం మిస్ అవుతున్నారో దాన్ని భర్తీ చేశారు దర్శకుడు సుజీత్. ఆయన స్టైలిష్ మేకింగ్, పవన్ లుక్స్, మ్యానరిజం, యాక్షన్, తమన్ నేపథ్యం హైలైట్. యూనివర్స్ క్రియేట్ చేసే ఆలోచన ఉందని దర్శకుడు ఇప్పటికే వెల్లడించారు. అందులో ప్రభాస్ నటిస్తారా? అన్న దానిపై ఇప్పుడేం ఏం చెప్పలేనన్నారు.
