థియేటర్ వాడు ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ రేటుకు మీ అభిమాన హీరో సినిమా టిక్కెట్ అమ్మితే ఏం చేస్తారు? ఒక రజనీకాంత్ అభిమాని ఈ విషయాన్ని కన్జ్యూమర్ గ్రీవెన్స్ కమీషన్ (CDRC)కి తీసుకెళ్లాడు. విజయం సాధించాడు. మొదటి నుంచి ఏం జరిగిందో చూద్దాం.
2021 నవంబరు 4న ‘అన్నాత్తే’ విడుదల కానుండటంతో అక్టోబరు 30న చెన్నైకి చెందిన సామాజిక కార్యకర్త జి.దేవరాజన్ ఆన్‌లైన్ వేదిక ద్వారా రూ.159.50 చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే, ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా ఎక్కువ ధర వసూలు చేయడాన్ని గుర్తించిన ఆయన దాన్ని సవాల్ చేస్తూ కన్జ్యూమర్ గ్రీవెన్స్ కమిషనర్ (నార్త్)కు ఫిర్యాదు చేశారు. పలు వాయిదాలు, వాదనల తర్వాత కమిషన్ ఛైర్ పర్సన్ రాజేశ్వరి గతేడాది నవంబరులో కేసు విచారణను పూర్తి చేశారు.
ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా అధికంగా వసూలు చేసినట్లు నిర్ధారణకు రావడంతో తాజాగా జరిమానా విధించారు. బాధితుడు దేవరాజు పడిన మానసిక వేదన, సేవలు సరిగా అందించకపోవడం, న్యాయపరమైన ఖర్చులతో పాటు ఏడాది రూ.9శాతం వడ్డీతో కలిపి రూ.12వేలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించారు. అయితే, ఈ తీర్పుపై థియేటర్ యాజమాన్యం అప్పీల్‌కు వెళ్తుందో లేదో తెలియాల్సి ఉంది. వ్యాపారుల దోపిడీపై ఇది విజయమని సామాజిక కార్యకర్త దేవరాజన్ పేర్కొన్నారు.
అయితే ప్రభుత్వం నిర్ణయించిన దాని కన్నా అదనంగా టికెట్ ధరను వసూలు చేసిన చెన్నైలోని ఓ థియేటర్‌కు జరిమానా పడింది. 2021 నాటి టికెట్ ధరకు 75 రెట్లు నష్టపరిహారం బాధితుడికి చెల్లించాల్సిందేనని కన్జ్యూమర్ గ్రీవెన్స్ కమిషనర్ ఆదేశించారు.
రజనీకాంత్ (Rajinikanth) కథానాయకుడిగా శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం ‘అన్నాత్తే’ (Annaatthe). నయనతార, కీర్తి సురేశ్ కీలక పాత్రలు పోషించారు.