మళయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ‘ఎల్ 2 ఎంపురాన్’ చిత్రం ఇప్పుడో వివాదంలో చిక్కుకున్నది. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ఈ మూవీని హిందూ వ్యతిరేక చిత్రంగా అభివర్ణిస్తూ ప్రకటనలు చేస్తంది. మరో ప్రక్క కాంగ్రెస్ ఈ చిత్రానికి మద్దతు ప్రకటించింది.
ఎంపురాన్ చిత్రం ఈ నెల 27న విడుదలైన విషయం తెలిసిందే. ఈ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. సినిమాలో అనుకున్న స్దాయిలో లేదని రివ్యూలు అంటున్నాయి. అదే సమయంలో ఎల్ 2 ఎంపురాన్‌పై ఆర్ఎస్ఎస్ తీవ్రంగా విమర్శలు గుప్పించింది. ఆర్ఎస్ఎస్ మౌత్ పీస్ ఆర్గనైజర్‌లో ప్రచురించిన కథనం ప్రకారం.. ఈ చిత్రం 2002 గోద్రా అల్లర్ల నేపథ్యాన్ని ఉపయోగించి హిందూ వ్యతిరేక రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకువస్తుందని ఆరోపించింది.
ఈ మూవీ స్టోరీ హిందువులను కించపరచడమే కాకుండా.. ప్రత్యేకంగా హిందూ అనుకూల రాజకీయ భావజాలాలను లక్ష్యంగా చేసుకుంటుందని విమర్శించింది. ఈ సినిమా హిందూ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక కథనాన్ని వ్యాప్తి చేయడానికి ఒక మాధ్యమమని.. వాస్తవాలను ఉద్దేశపూర్వకంగా వక్రీకరించారంటూ మండిపడింది.
భారతదేశంతో సహా ఉపఖండంలో జరుగుతున్న మారణహోమం మధ్య హిందువులను విలన్లుగా చిత్రీకరించే హిందూ వ్యతిరేక ప్రచార చిత్రం ఎంపురాన్ అంటూ మండిపడింది.
బీజేపీ కేరళ ప్రధాన కార్యదర్శి పీ సుధీర్ మాట్లాడుతూ ఈ మూవీ తన దారిలో వెళ్తుందని.. పార్టీ సైతం తన పని తాను చేసుకుంటుందన్నారు.