కుర్రాళ్లకి పెళ్లి అవటం పెద్ద యజ్ఞంగా మారిపోయింది. అందుకోసం ఎక్కని మెట్లు లేవు, తిరగని ఊళ్లు లేవు అన్నట్లుంది పరిస్దితి. అందుకు గల కారణాలు అందరికీ తెలిసినా సినిమాల్లో చూస్తే అదో కిక్కు. అదే విషయం గమనించిన దర్శక,నిర్మాతలు వాటిలను కథలగా అల్లి సినిమాలు తీసి మన ముందు పెడుతున్నారు. అలాంటి మరో కొత్త సినిమా పెళ్లి కాని ప్రసాద్. టైటిల్ లోనే విషయం చెప్పేసిన ఈ సినిమా..లోపల కంటెంట్ ఏముంది. రెండు గంటలు కూర్చోబెట్టడానికి ఎంచుకున్న వ్యూహం ఏమిటి, ఆ వ్యూహం ఫలించిందా వంటి విషయాలు రివ్యూలో చూద్దాం.

స్టోరీ లైన్

ప్ర‌సాద్ (సప్త‌గిరి) మ‌లేషియాలోని ఒక స్టార్ హోట‌ల్‌లో మేనేజ‌ర్‌. వయస్సు మీద పడినా పెళ్లి కాదు. అందుకు కారణం తండ్రి(మురళీధర్‌) కి క‌ట్నం మీద ఉన్న ఆశ‌. తన కొడుక్కి మినిమం రూ.2 కోట్లు క‌ట్నం కావాల‌ని ప‌ట్టు ప‌ట్టి వుట్టి మీద కూర్చుంటాడు. ఇది చాలదన్నట్లు తమ వంశ‌స్తులు శాస‌నాల గ్రంథ‌మ‌ని క‌ట్నంపైన ఒక రాజ్యాంగం కూడా రాసి వుంటారు.

ఇదిలా ఉంటే ప్రియ (ప్రియాంక శ‌ర్మ‌) కి మరో రకమైన పిచ్చి. ఫారిన్ పిచ్చి. ఆమె తనకు తగ్గ కుర్రాడిని చూసి పెళ్లి చేసుకుని ఫారిన్ వెళ్లి సెటిల్ అవ్వాలనేది ఆలోచన. అంతేకాకుండా తన అమ్మానాన్న‌, అమ్మ‌మ్మ‌, ప‌నివాడులని కూడా తీసుకుని వెళ్లాలనుకుంటుంది. ఈ క్రమంలో ఫారిన్ లో ఉన్న ప్రసాద్ గురించి తెలుసుకుని ప్రేమ‌లోకి దించి పెళ్లి చేసుకుంటుంది. అయితే పెళ్లయ్యాక ఫస్ట్ నైట్ ఓ విషయం రివీల్ అవుతుంది.

సదరు ప్రసాద్ కు ఇంక ఇండియాలో ఉండిపోవాలని ఉందని, ఫారిన్ వెళ్లాలని లేదని. దాంతో కొత్త దంపతుల ఇద్దరి మధ్యా ప్రచ్చన్న యుద్దం మొదలవుతుంది. ప్రణయం కాస్తా ప్రళయం అవుతుంది. ఇది దేనికి దారి తీసి తీసింది. అసలు ప్రసాద్ మళ్లీ ఎందుకు ఫారెన్ ఎందుకు వెళ్ల కూడదనకున్నాడు. ప్రియ జీవితాశయం వదలుకోవటానికి ఇష్టపడిందా, చివరకు ఏమైంది వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్

పెళ్లి కాని ప్ర‌సాద్ పాయింట్ సమకాలానికి దగ్గరిగా అనిపించినా ట్రీట్మెంట్ మాత్రం 1990 నాటికి దగ్గరగా ఉంటుంది. సీన్స్ అలాగే ఉంటాయి. అసలే ట్రైలర్ తోనే కథ మొత్తం ఊహించేస్తున్నారు. అలాంటిది మెల్లిగా పాత్ర‌ల ప‌రిచ‌యం చేస్తూ కథలోకి వెళ్లేసరికి ఇంటర్వెల్ కు వస్తే అది చూసేటంత ఓపిక సదరు ప్రేక్షకుడుకు ఉంటోందా. అందులోనూ కామెడీ హీరో చేసే సినిమా అంటే అంతకు మించి ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. స్టార్ లేని చోట స్టార్ లాంటి కథ ఖచ్చితంగా ఉండాలి. అదే మిస్సైంది.

ఫస్టాఫ్ తండ్రి కట్నం ఆశ, అలాగే అమ్మాయి ఫారిన్ సంభందం ఆలోచన ఈ రెండు సింక్ చేస్తూ కథ నడుస్తూంటే బాగానే ఉందనిపిస్తుంది. అయితే పెళ్లి తర్వాత కథను ఎటు వైపు తిప్పాలో డైరక్టర్ కు అర్దం కాలేదు. దాంతో రొటీన్ గా సీన్స్ వేసుకుంటూ ముగింపుకు తీసుకెళ్ళాడు. హీరో పెళ్లి కాకుండా ఎన్నో ఇబ్బందులను ఫేస్ చేసే సీన్స్ బాగానే పండాయి. అలాగే మ్యారేజ్ చేసుకొని ఫారెన్ లో సెటిల్ అవ్వాలనుకున్న అమ్మాయికి అతను ఫారెన్ వెళ్లడు అని తెలివటం ట్విస్ట్ గా బాగుంది.

అయితే ఆ తర్వాత ఎలాంటి ఇబ్బందులను ఫేస్ చేసిందనేది క్లియర్ గా ఇంట్రస్టింగ్ గా చెప్పాలి. మెసేజ్ ఇవ్వకపోయినా ఫర్వాలేదు. కంటెంట్ బలంగా ఉండాలి. అలాగే ఇలాంటి కథకు ముగింపు బలంగా లేకపోతే తేలిపోతుంది. అదే జరిగింది. క్లైమాక్స్ చాలా క్యాజువల్ గా లాగేసారు.

టెక్నికల్ గా చూస్తే…

శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కొన్ని నార్మల్ సీన్స్ కు కూడా మంచి హై ఇచ్చింది. సెకండాఫ్ లో విసుగించే కొన్ని సీన్స్ ని ఎడిట్ చేయాల్సింది. సుజాత సిద్దార్థ్ సినిమాటోగ్రఫి సినిమాని నెక్ట్స్ లెవిల్ కు తీసుకెళ్లకపోయినా రిచ్ లుక్ తెచ్చిపెట్టింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. కామెడీ సినిమాలకు అవసరమైన డైలాగులు అక్కడక్కడా బాగానే పడ్డాయి.

ఇక సప్తగిరికు ఇలాంటి పాత్రలు కొట్టిన పిండి. తన టైప్ మ్యానరిజంలతో కొన్ని సీన్స్ లో బాగానే నవ్వించాడు. అలాగే తండ్రి పాత్రలో మురళీధర్ గౌడ్ కామెడీ బాగానే నవ్వించింది.

చూడచ్చా

ఓ మాదిరి కామెడీని ఎక్సపెక్ట్ చేస్తే మంచి కాలక్షేపమే. క్లాస్ కామెడీని, దమ్మున్న సినిమాని ఎక్సెపక్ట్ చేస్తే మాత్రం దూరంగా ఉండటం మేలు.

బ్యానర్: థామ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్స్
నటీనటులు: సప్తగిరి, ప్రియాంక శర్మ, వడ్లమాని శ్రీనివాస్, మురళీ గౌడ్, ప్రమోదిని, రోహిణి, తదితరులు..
సమర్పణ: చాగంటి సినిమాటిక్ వరల్డ్
డిఓపి: సుజాత సిద్దార్థ్
సంగీతం: శేఖర్ చంద్ర
ఎడిటర్: మధు
కథ,స్క్రీన్ ప్లే , దర్శకత్వం: అభిలాష్ రెడ్డి గోపిడి
నిర్మాతలు: K.Y.బాబు (విజన్ గ్రూప్), భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల

, ,
You may also like
Latest Posts from