సినిమా థియేటర్లకు పదహారేళ్లలోపు పిల్లలు వెళ్లే సమయ వేళలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 11 గంటల వరకు పదహారేళ్లలోపు పిల్లలను థియేటర్లలోకి అనుమతించొద్దని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు అన్ని వర్గాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించింది.
సినిమా టికెట్ల ధరల పెంపు, ప్రత్యేక షోల అనుమతి వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేశారు.
వేళాపాలా లేని షోలకు పిల్లలు వెళ్లడం వల్ల వాళ్ల ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు.
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం.. ఈ నిర్ణయం తీసుకుంది.తదుపరి విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేసింది.
తొలుత పిటిషనర్ తరఫు న్యాయవాది విజయ్‌గోపాల్ వాదనలు వినిపిస్తూ.. సినిమాటోగ్రఫీ నిబంధనల ప్రకారం ఉదయం 8.40 గంటల లోపు, తెల్లవారుజామున 1.30 తరువాత సినిమాలకు అనుమతించరాదన్నారు.
ముఖ్యంగా మైనర్లను అనుమతించరాదని, లేనిపక్షంలో అది వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. మల్టీప్లెక్స్‌ల్లో చివరి షో తెల్లవారుజాము 1.30 వరకూ నడుస్తుందని, వీటిలోకి మైనర్ల ప్రవేశానికి ఎలాంటి నియంత్రణలు లేవని చెప్పారు.
పుష్ప-2 ప్రదర్శన సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందారని, బాలుడు తీవ్రంగా గాయపడ్డారని, ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవిస్తూ రాత్రి 11 తరువాత థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లోకి పిల్లలను అనుమతించడం సరైన చర్య కాదన్నారు.
దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశిస్తూ.. అప్పటివరకూ 16 ఏళ్లలోపు పిల్లలను ఉదయం 11లోపు, రాత్రి 11 తరువాత సినిమా ప్రదర్శనలకు అనుమతించరాదని థియేటర్ల యాజమాన్యాలకు ఆదేశాలు జారీచేశారు. హోంశాఖ కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర ఫిలిం టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తదితరులకు నోటీసులు జారీచేస్తూ విచారణను ఫిబ్రవరి 22కు వాయిదా వేశారు.