బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతెలా చిరంజీవి తనకు ఏ విధంగా సాయం చేశారో చెప్పుకొచ్చింది. చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ‘బాసూ వేర్ ఈజ్ ద పార్టీ’ అంటూ చిరంజీవితో స్టెప్పులేసింది. ఆ పాట బాగా క్లిక్ అయ్యింది. ఆ పరిచయంతోనే తమ కుటుంబానికి చాలా హెల్ప్ చేసారంటోంది ఆమె.
ఇటీవల ఆమె తల్లి మీను రౌతేలా తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఎడమ కాలిలో ఇంట్రా – ఆర్టిక్యులర్ ఫ్రాక్చర్‌తో ఆస్పత్రిలో చేర్పించారు. ఇదెంతో ప్రమాదకరమని డాక్టర్లు చెప్పగా ఊర్వశి.. చిరంజీవిని సంప్రదించి సహాయం కోరిందట.
వెంటనే స్పందించిన మెగాస్టార్.. కోల్‌కతాలోని అపోలో ఆస్పత్రిలో డాక్టర్ల బృందంతో మాట్లాడి మీనూ రౌతెలాకు మెరుగైన వైద్యం అందేలా చేశారట. సర్జరీ అనంతరం ఊర్వశి తల్లి సమస్య నుంచి పూర్తిగా కోలుకున్నారట. ఇప్పుడు ఇదే విషయాన్ని ఊర్వశి అందరితో షేర్ చేసుకుంది.
ఊర్వశి రౌతెలా మాట్లాడుతూ…. ‘చిరంజీవి గారి సేవా కార్యక్రమాల గురించి చాలా విన్నాను. వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్‌లో ఆపదలో ఉన్న వారికి నేను చూస్తుండగానే ఎంతో మందికి సాయం అందించారు. ఆ సాయం నా వరకూ వచ్చింది. అమ్మ కాలి ఎముకకు పెద్ద సమస్య వచ్చింది. మొహమాటంగానే చిరంజీవి గారి సాయం కోరాను. వెంటనే స్పందించిన ఆయన కోల్‌కతాలోని డాక్టర్లతో మాట్లాడి అమ్మకు సర్జరీ చేయించారు. అనంతరం మీ అమ్మ బాగానే ఉన్నారు, ఆమె ఆరోగ్యంగా ఉంటారని ధైర్యం చెప్పారు.
ఆయన చెప్పిన మాటలు నాకు కొండంత ధైర్యాన్నిచ్చాయి. ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ అండగా నిలిచారు. ఏ అవసరం వచ్చినా అడగడానికి మొహమాటపడొద్దన్నారు. భూమ్మీద ఇంకా మంచితనం, మానవత్వం బతికే ఉందని చిరంజీవి గారు నిరూపించారు. మా కుటుంబం ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటుంది. ఆయన్ను దేవుడిగా, మా శక్తికి లైట్‌హౌస్‌గా భావిస్తాను’ అని ఊర్వశి ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది.