పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన మోస్ట్ ఎవైటెడ్ పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లులో ఒక సెన్సేషన్ ఎలిమెంట్ ఏమిటంటే… కోహినూర్ వజ్రం చుట్టూ నడిచే కథ! పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనే స్పష్టంగా చెప్పారు – ఈ సినిమాలో నెమలి సింహాసనం నుంచి కోహినూర్ వజ్రాన్ని దొంగలించే మిషన్ ఒక మెయిన్ హైలైట్.
ఇంతకీ ఈ కోహినూర్ వజ్రం అసలు ఏమిటీ? ఇప్పుడది ఎక్కడుందో తెలుసా?
కొల్లూరులో పుట్టిన వజ్రం.. బ్రిటన్‌కి చేరిన దాకా..
ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే ఈ వజ్రం ఒకప్పుడు మన తెలుగు నేలదే! ఇప్పటి ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా, బెల్లంకొండ మండలం కొల్లూరు గనుల్లోనే మొదటగా లభించింది. అక్కడి నుంచి మొఘల్ చక్రవర్తి బాబర్ చేతికి చేరింది. తరువాత హుమాయూన్, షాజహాన్, ఔరంగజేబు వంటి గొప్ప చక్రవర్తుల చేతుల్లో మారుతూ పోయింది.
ఇంతగా ప్రాముఖ్యత ఎందుకు అంటే… షాజహాన్ నెమలి సింహాసనంలో ఈ వజ్రాన్ని పొదిగించాడు!
1739లో ఢిల్లీపై దండెత్తిన పర్షియన్ పాలకుడు నాదిర్ షా ఈ వజ్రాన్ని చూసి “కోహ్-ఇ-నూర్” (అర్థం – కాంతిపర్వతం) అనే పేరు పెట్టేశాడు. ఆ తర్వాత ఇది ఆఫ్ఘనిస్తాన్, పంజాబ్ మీదుగా సిక్కుల చేతికి చేరింది. చివరికి 1849లో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి బహుమతిగా ఇచ్చేయాల్సి వచ్చింది.
ఇప్పుడు వజ్రం ఎక్కడుందంటే…
ప్రస్తుతం ఈ కోహినూర్ వజ్రం బ్రిటన్ రాజకుటుంబం ఆధీనంలో ఉంది. ఇది క్వీన్ ఎలిజబెత్ ది క్వీన్ మదర్ క్రౌన్‌లో భాగంగా ఉంది. ఈ వజ్రాన్ని మళ్లీ భారత్‌కి తీసుకురావాలని భారత్‌తో పాటు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ దేశాలు కూడా వాదిస్తున్నాయి. కానీ బ్రిటన్ మాత్రం – “ఇది మా వారసత్వ సంపద” అని చెప్పుకుంటూ తిరస్కరిస్తోంది.
ధర ఎంతంటే..? కానీ ఓ అర్థం లేని రాయి కాదు ఇది!
ఈ వజ్రం బరువు 105.6 క్యారెట్లు అంటే సుమారు 21.12 గ్రాములు. దీన్ని మార్కెట్ వాల్యూగా అంచనా వేయడం సాధ్యపడదు. ఎందుకంటే ఇది కేవలం విలువైన వజ్రం కాదు – ఏకంగా పలు యుద్ధాలు, రాజకీయం, సామ్రాజ్యాల ఔనత్యానికి సాక్షి!
ఇంతటి చరిత్ర ఉన్న ఈ వజ్రం ఇప్పుడు ఒక సినిమాకి అగ్ర పాత్రలా మారడం ఓ ఆసక్తికర పరిణామమే.
వీరమల్లుతో పాటు మనకు ఈ కోహినూర్ తిరిగొస్తుందా?
ఇది సినిమాల్లో మాత్రం సాధ్యమైపోవచ్చు. రియాలిటీలో మాత్రం… కోహినూర్ కోసం మనం ఇంకా ఎదురు చూడాల్సిందే!