
‘ధురంధర్’ దెబ్బ? అక్షయ్ ఖన్నాకు ‘దృశ్యం 3’ నిర్మాత లీగల్ నోటీసు
‘ధురంధర్’ సినిమా తర్వాత అక్షయ్ ఖన్నా పేరు బాలీవుడ్ ట్రేడ్‌లో కొత్తగా మార్మోగుతోంది. చాలాకాలంగా సెలెక్టివ్ సినిమాలతో, నిశ్శబ్దంగా కెరీర్ కొనసాగించిన అక్షయ్‌కు ‘ధురంధర్’ ఒక పవర్‌ఫుల్ రీ-ఎంట్రీగా మారింది. ఆ సినిమాలో ఆయన నటనకు వచ్చిన ప్రశంసలు కేవలం అభిమానుల వరకే కాదు, ట్రేడ్ సర్కిల్స్, నిర్మాతల దాకా వెళ్లాయి. దీంతో అక్షయ్ ఖన్నా మార్కెట్ ఒక్కసారిగా పైకి ఎగబాకింది. కొత్త ఆఫర్లు, కీలక పాత్రలు, భారీ ఫ్రాంచైజీల్లో భాగస్వామ్యం వంటి అవకాశాలు ఆయన కెరీర్ ముందు నిలిచాయి. ఈ క్రేజ్ ప్రభావం ఆయన భవిష్యత్ సినిమాల మీద, అలాగే నిర్మాతలు చేసే లెక్కల మీద కూడా తప్పకుండా పడుతుందనే చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అక్షయ్ ఖన్నా పేరు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఈసారి కారణం సినిమా కాదు, నేరుగా లీగల్ వివాదం. ‘దృశ్యం 3’ నిర్మాత కుమార్ మంగత్ పాఠక్, ‘అక్షయ్ ఖన్నా’కు లీగల్ నోటీసు పంపడం బాలీవుడ్‌లో కలకలం రేపింది. ‘దృశ్యం 3’ చిత్రానికి సంబంధించి చేసుకున్న ఒప్పందాన్ని అక్షయ్ ఉల్లంఘించారని నిర్మాత ఆరోపిస్తున్నారు. దురంధర్ తర్వాత కొత్త సినిమాల ఎంపికలో ఆచితూచి ముందుకు వెళ్లాలనే భావనతో అక్షయ్ ఖన్నా.. ‘దృశ్యం 3’ కు దూరం అవ్వాలనుకుంటున్నాడని బాలీవుడ్ లో బలంగా వినపడుతోంది.
నిర్మాత చెప్పిన వివరాల ప్రకారం, ‘దృశ్యం 3’ కోసం దాదాపు రెండేళ్లుగా స్క్రిప్ట్ డెవలప్‌మెంట్ జరుగుతోంది. స్క్రిప్ట్ వినిన తర్వాత అక్షయ్ ఖన్నాకు కథ నచ్చిందని, ఆ తర్వాతే అధికారికంగా ఆయనతో ఒప్పందం కుదిరిందని తెలిపారు. షూటింగ్‌కు ముందే అడ్వాన్స్‌గా కొంత మొత్తం కూడా చెల్లించామని స్పష్టం చేశారు. అన్ని విషయాలు పక్కాగా ఫిక్స్ అయిన దశలో, తాను ఈ సినిమాలో భాగం కావడం లేదని అక్షయ్ ఖన్నా ఒక్క టెక్ట్స్ మెసేజ్ ద్వారా తెలియజేశారని నిర్మాత వాపోయారు.
ఆ మెసేజ్ వచ్చిన తర్వాత అక్షయ్‌ను వ్యక్తిగతంగా సంప్రదించేందుకు పలుమార్లు ప్రయత్నించినా, ఆయన అందుబాటులోకి రాలేదని కుమార్ మంగత్ పాఠక్ చెప్పారు. ఈ పరిస్థితుల్లో తమకు మరో మార్గం లేక లీగల్ నోటీసులు పంపాల్సి వచ్చిందని వెల్లడించారు. ఒప్పందం ప్రకారం ఇది స్పష్టమైన ఉల్లంఘన అని, తమకు జరిగిన నష్టానికి న్యాయం జరగాలన్నదే తమ ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.
ఇదే సమయంలో నిర్మాతలు మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. అక్షయ్ ఖన్నా స్థానంలో ‘జైదీప్ అహ్లావత్’ను ‘దృశ్యం 3’లోకి తీసుకున్నట్లు అధికారికంగా తెలిపారు. నటన పరంగా బలమైన ఇమేజ్ ఉన్న జైదీప్ ఈ పాత్రకు సరైన ఎంపికగా భావిస్తున్నామని వారు చెబుతున్నారు.
మొత్తానికి, ‘ధురంధర్’ తర్వాత కెరీర్‌లో మళ్లీ పీక్ ఫేజ్‌లోకి వచ్చిన అక్షయ్ ఖన్నా, ఇప్పుడు ఈ లీగల్ వివాదంతో మరోసారి ట్రేడ్ చర్చల్లో నిలిచారు. ఈ వ్యవహారం ఆయన ఇమేజ్‌పై ఎంతవరకు ప్రభావం చూపుతుందో, అలాగే ‘దృశ్యం 3’ ప్రయాణం ఎలా కొనసాగుతుందో అన్నది బాలీవుడ్ మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.
