టాలీవుడ్‌లో మరోసారి రాజకీయం – సినిమా ముసుగులో నిప్పులే చెరిగుతోంది! ఇటీవలి కొన్ని ఆరోపణలపై స్పందించేందుకు నిర్మాత దిల్ రాజు ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. కొందరు సినీ ప్రముఖులు, మీడియా వర్గాలు చేసిన విమర్శలకు గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం ఎదురవుతున్న సమస్యలపై తన వంతు స్పష్టతనిచ్చిన దిల్ రాజు, థియేటర్ల సమ్మెకు కారణమైన వ్యక్తిగా జనసేన నేత అనుశ్రీ సత్యనారాయణను నేరుగా వేలెత్తి చూపించారు. ఇదే సమయంలో, ఆ వ్యక్తిని జనసేన పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది.

కానీ… సత్యనారాయణ ఆగలేదు! వెంటనే కౌంటర్ ప్రెస్‌మీట్ పెట్టి తానేంటో చూపించారు. ఈసారి ఆయన నేరుగా దిల్ రాజు సోదరుడు శిరీష్‌పై బాంబే పడేశారు. థియేటర్ల సమ్మె వెనక అసలు మాస్టర్‌ ప్లాన్ శిరీష్‌దేనని ఆరోపించారు. అంతే కాదు, ఆంధ్రప్రదేశ్‌లోని ఎగ్జిబిటర్లను ఒత్తిడి చేయడం ద్వారా శాతం ప్రాతిపదికన థియేటర్లు నడుపుదాం అనే డిమాండ్ లేఖపై సంతకాలు చేయించారంటూ గట్టిగా ఆరోపించారు.

ఈ అంతా జరుగుతున్న సమయంలో పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న హరి హర వీర మల్లు రిలీజ్ డేట్‌పై స్పష్టత లేకపోయినప్పటికీ, ఇలా నిర్ణయాలు తీసుకున్నారంటూ క్లారిటీ ఇచ్చారు.

తన రాజకీయ భవిష్యత్తు ప్రమాదంలో పడేలా చేశారంటూ దిల్ రాజుపై కోర్టుకెళ్లనున్నట్టు కూడా ప్రకటించిన సత్యనారాయణ, ఈ ప్రకటనతో ఒక్కసారిగా మీడియా దృష్టంతా మళ్లించారు.

సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లు నష్టాల్లో ఉన్నాయని, పర్సంటేజీ విధానం ఉంటే బాగుంటుందని రాజమహేంద్రవరంలో నిర్వహించిన తమ అంతర్గత సమావేశాల్లో చర్చించామే తప్ప, జూన్‌లో బంద్‌ అనే ప్రసక్తి రాలేదన్నారు. పర్సంటేజీ విధానం అమలు చేయాలని డిస్ట్రిబ్యూటర్లను విజ్ఞప్తి చేసేందుకు ఏప్రిల్‌ 19న సమావేశం నిర్వహిస్తే దాన్ని వక్రీకరించి తనపై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు.

ఈ నెల 13న ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఇబ్బంది ఉంటే థియేటర్లను మూసేస్తామని మాత్రమే అన్నానని..అప్పటికి హరిహరవీరమల్లు విడుదల తేదీ ప్రకటించలేదన్నారు. బంద్‌ అంశం తెరమీదకు వచ్చిన వెంటనే అటువంటిదేమీ లేదని తాను ముందుగానే ప్రకటించినట్లు గుర్తుచేశారు.

ఇక జనాలు, నెటిజన్లు – “దిల్ రాజు ఎలా మాట్లాడతారు?!” అంటూ మండిపడుతున్నారు. మరొకవైపు అనుశ్రీ సత్యనారాయణ చేసిన ఆరోపణలతో దిల్ రాజుపై విమర్శల జ్వాలలు రగులుతున్నాయి.

సినిమా వేదిక మీద సినిమా రాజకీయాలు మొదలయ్యాయి… ఎక్కడ కట్ అవుతాయో చూడాలి!

You may also like
Latest Posts from