పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో నిర్మితమవుతున్న భారీ పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ ‘హరిహర వీరమల్లు’ విడుదలకి మరికొద్ది రోజులే ఉంది. ఈ సమయంలో కొత్త సమస్యల్లో పడింది. తెలంగాణ యోధుడు పండుగ సాయన్న జీవితాన్ని ఈ సినిమాలో వక్రీకరించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

పండుగ సాయన్న జీవిత చరిత్రను రాసిన రచయిత, తెలంగాణ ఉద్యమకారుడు బెక్కెం జనార్దన్ ఈ సినిమాలో చారిత్రక వాస్తవాలను తారుమారు చేస్తున్నారని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. “సాయన్న జీవిత కథపై సర్వహక్కులు నాకే ఉన్నాయి. సినిమా టీమ్ వాటిని ఉల్లంఘిస్తే… నేరుగా పవన్ కళ్యాణ్‌పైనే కేసు వేయడానికి వెనుకాడమని,” అంటూ ఆయన గట్టిగా హెచ్చరించారు.

“చరిత్రతో చెలగాటమాడితే ఊరుకునేది లేదు!”

జనార్దన్ వెల్లడించిన వివరాల ప్రకారం… “ఈ సినిమా పూర్తిగా కల్పిత ఘట్టాలతో సాగుతోంది. పండుగ సాయన్న బతుకును, పోరాటాన్ని తమ అవసరానికి అనుగుణంగా మలచుకుంటున్నారు. ఇది చరిత్రను దుర్వినియోగం చేసే చర్య,” అంటూ విమర్శలు గుప్పించారు.

తప్పుడు విషయాలు ఉన్న సన్నివేశాలను వెంటనే తొలగించాలని, లేనిపక్షంలో న్యాయపోరాటం చేసి సినిమా విడుదలను అడ్డుకుంటామని ఆయన ఖరాఖండిగా హెచ్చరించారు.

ఈ ఆరోపణలతో సినిమా వర్గాల్లో టెన్షన్ మొదలైంది. ఇప్పటికే భారీ బడ్జెట్‌తో, విజువల్ గ్రాండియర్‌తో రూపొందుతున్న ఈ ప్రాజెక్టు… ఇప్పుడు చరిత్రా వివాదంలో చిక్కుకోవడం కలకలం రేపుతోంది.

ఇప్పుడు అందరి దృష్టీ ‘హరిహర వీరమల్లు’ టీమ్ ఎలా స్పందిస్తుందనే దానిపై నిలిచింది. కథలో వాస్తవాల తేడా ఉంటే సవరించారా? లేక కొత్త వివాదానికి దారితీస్తారా? త్వరలో క్లారిటీ రానుంది.

, , , , , ,
You may also like
Latest Posts from