కొన్ని సినిమాల టైటిల్స్ వినగానే గమ్మత్తుగా అనిపిస్తాయి. అదే సమయంలో ఏ ఓటిటి సినిమానో అనే అనుమానం వచ్చేలా చేస్తాయి. అలాంటి టైటిల్ “ఓ భామ.. అయ్యో రామ!”! సుహాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం …సినిమా పరిశ్రమ నేపధ్యంలో రూపొందింది. యూత్‌ఫుల్ కాన్సెప్ట్, వినోదభరితమైన టీజర్, మారుతి, హరీశ్ శంకర్‌ల స్పెషల్ అప్‌పీరెన్సులు—అన్ని మిక్స్ చేయడంతో ఈ సినిమా మీద అంచనాలు బాగానే పెరిగాయి. మరి భామ, ప్రేమ ఎంటర్టైనర్ ప్రేక్షకుల హృదయాల్లో చోటుదక్కించుకుందా, అంచనాలకు తగిన స్దాయిలో అలరించిందా? సుహాస్‌కు హిట్ అందిందా?
స్టోరీ లైన్
సినిమాలంటే ఇష్టం లేని రామ్ (సుహాస్) జీవితంలోకి సత్యభామ (మాళవిక మనోజ్) వస్తుంది. ఆమెతో ప్రేమలో ఉండగా రామ్‌కు ఇష్టం లేకున్నా.. డైరెక్టర్ హరీష్ శంకర్ వద్ద అతడిని అసిస్టెంట్‌గా చేర్పిస్తుంది. అంతేకాదు అతనికి కథలు చెప్తూంటుంది. అయితే ఆమె ప్రేమ కోసం భరిస్తూంటాడు. ఇలా సాగిపోతున్న సమయంలో రామ్‌కు సత్యభామ ఓ పెట్టకూడని కండిషన్ పెడుతుంది.
మూడేళ్లు తనని మర్చిపోవాలని రామ్ వద్ద ప్రామిస్ తీసుకుంటుంది. ఈ మూడేళ్లలో నువ్వు గొప్ప డైరెక్టర్ కావాలని మాట తీసుకుంటుంది. మరి సత్యభామ అలా ఎందుకు చేసింది? సినిమాలంటే ఇష్టం లేని రామ్‌ని హరీష్ శంకర్ వద్ద అసిస్టెంట్‌గా ఎందుకు జాయిన్ చేయించింది. రామ్ గతం ఏంటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
సినిమాలో ఫన్, ఎమోషన్ ,తల్లి సెంటిమెంట్, లవ్ ఇలా చాలా అంశాలు ఉన్నాయి కానీ వీటిని అన్నిటిని కూర్చే సరైన థ్రెడ్ కనపడదు. “Some wounds don’t bleed, they echo in silence.” అన్న పాయింట్ ని బేస్ చేసుకున్నట్లు ఉన్న కథలో ఎమోషన్ ని తెరపై తేలిపోయింది. ముఖ్యంగా రొటీన్ ట్రీట్మెంట్ తో సినిమా నడవటం వల్ల భావోద్వేగాలు డెప్త్ గా తాకవు. సినిమాలో కథ సత్యభామ ఎంట్రీతో గడప దాటుతుంది. కానీ అక్కడ నుంచీ కథనం దారితప్పిన బస్సు లాగ మారిపోతుంది. హీరోయిన్ పెట్టే షరతులు, ప్రేమలో వచ్చే క్లిష్టతలు అన్నీ “Seen that, felt that” అనిపించేలా ఉంటాయి.
ఫస్టాఫ్ ఒక యాక్సిడెంట్ సీక్వెన్స్‌తో ఇంటర్వెల్‌కు చేరుతుంది — కానీ అది ఆశించినంత షాకింగ్ కాదు. ఇక్కడ “Emotional punch” కావాల్సిన చోట “Logical patch” పడినట్లైంది. సెకండాఫ్ లో రామ్ తల్లి పట్ల ఉన్న ప్రేమ, బాధలను స్పష్టంగా చెప్పే ప్రయత్నం కనిపిస్తుంది. అనిత పోషించిన తల్లి పాత్రలో కొంత లాజిక్ ఉన్నా, emotional resonance మాత్రం లోపించింది. ఫైనల్ గా క్లైమాక్స్‌లో ఓ చిన్న ట్విస్ట్‌తో “feel-good” నోటు ఇవ్వాలన్న యాంగిల్ దర్శకుడికి ఉన్నా, అది చెప్పే విధానం చాలా సాదాసీదాగా ఉంది. దాంతో అదీ సోసోగా మారిపోయింది. అలా ఎక్కడా ఏ విషయం రిజస్టర్ కాకుండా సినిమా అలా అలా సాగిపోయింది.
టెక్నికల్ గా ..
పాటలు ఏమీ గొప్పగా లేవు కానీ నేపధ్య సంగీతం ఫరవాలేదు అనిపిస్తుంది. దర్శకుడు ఎత్తుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ ఎంగేజింగా చెప్పడంలో తడబడ్డాడు. ఐడియాని కొత్తగా ఆలోచించిన దర్శకుడు స్క్రీన్ ప్లే పై దృష్టి పెట్టి ఉంటే సినిమా ఇంకాస్త మెరుగ్గా వుండేది. నిర్మాత హరీష్ నల్లా ఉత్తమ ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. సినిమా రిచ్‌గా క్వాలిటీగా కనిపిస్తుంది.మణికందన్ సినిమాటోగ్రఫి, బ్రహ్మ కడలి ఆర్ట్ వర్క్ ప్లస్ అయ్యాయి. డైలాగులు సోసోగా ఉన్నాయి. నటీనటుల పెర్ఫార్మెన్స్, కొన్ని హాస్య సన్నివేశాల్లో తప్పించి పెద్దగా అనిపించవు.
చూడచ్చా
ఓటిటిలో వచ్చాక చూడచ్చు అనిపించే చిత్రమే. అర్జెంట్ గా థియేటర్ కు వెళ్లి చూడాల్సిన స్దాయి సినిమా అయితే కాదు.