
జంగ్లీపట్నం…ఆ ఉదయం పూట మైక్ గళం మ్రోగుతూంటుంది – “మన తుట్టేకులం బలం ఏమిటో చూపెట్టడానికి ఈసారి మన నాయకుడు ఎమ్మెల్యే అవుతాడు!” అని, అక్కడే నిలబడి ఉన్నాడు నారాయణ (వీటీవీ గణేశ్) – కులం అంటే పిచ్చి, గౌరవం అంటే శ్వాస. తన రాజకీయ కల, తన కుల గర్వం – రెండూ ఒకే తాటిపై నడిపిస్తూంటాడు.
కానీ ఆ తాటిపైనే ఒక్క చీలిక…
తన కూతురు స్వేచ్ఛ (నిహారిక NM) ఇంటి నుంచి పారిపోతుంది.
ఒక ప్రేమ కోసం, ఒక ఆలోచన కోసం, ఒక స్వేచ్ఛ కోసం.
ఇప్పుడు నారాయణకు ఇది కేవలం “కూతురు పారిపోయింది” అనేది వార్త కాదు –
ఇది తన కుల గౌరవానికి, తన రాబోయే ఎమ్మల్యే పదివికి మరణ ఘంటిక.
అందుకే రంగంలోకి దింపుతాడు ఎస్.ఐ సాగర్ (వెన్నెల కిషోర్)ని – తన కూతురు లేచిపోయిందని చెప్పకుండా కిడ్నాప్ అయ్యిందని చెప్పి, ఈ కేస్ ని సరిగ్గా డీల్ చేసి క్లోజ్ చేస్తే భారీ మొత్తం ఇస్తానని ఆశపెట్టి. అప్పుడు నారాయణ గౌరవాన్ని కాపాడే మిషన్‌లో దూకున సాగర్ కు ఇంపార్టెంట్ క్యారెక్టర్ (సత్య) సాయిం చేస్తాడు. అలా సాగర్‌కి దొరికే మొదటి లీడ్ – ఒక ఫోన్ నెంబర్, అది నలుగురికి దారి చూపుతుంది –
చైతన్య (ప్రియదర్శి), అభయ్ (రాగ్ మయూర్), సాత్విక్ (విష్ణు ఓ.ఐ), రాజీవ్ (ప్రసాద్ బెహరా).
ఒక చిన్న అపార్ట్మెంట్, నలుగురు స్నేహితులు, వారిని చుట్టుముట్టిన అబద్ధాలు, మధ్యలో చిక్కుకున్న ఒక అమ్మాయి. ప్రేమ, కులం, రాజకీయాలు, పరువు – ఇవి అంతా ఒకే ఫ్రేమ్‌లో ముడిపడిన క్రమంలో ఏం జరిగింది. ఇంతకీ స్వేచ్చను ప్రేమించింది ఎవరు…ఆ నలుగురు కుర్రాళ్లకు ఆమె ప్రేమ కథకు సంభందం ఉందా వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ
“ప్రతి కులం ఒక గోడే అయితే, ప్రేమే ఆ గోడను కూల్చే మొదటి రాయి.” అనే కాన్సెప్టుని బేస్ చేసుకుని కామెడీగా రాసుకున్న స్క్రిప్టు ఇది. “మిత్ర మండలి” కథ వాయిస్ ఓవర్‌తోనే మొదలవుతుంది – కానీ ఆ వాయిస్ ఓవర్ ఏదీ అన్‌ఫోల్డ్ చేయదు, కేవలం ఒక గోడ మీద పోస్టర్ లా కథని చెప్పేస్తుంది. ఏ కామెడీ ఎంటర్‌టైనర్‌కైనా “సింపుల్ స్టోరీ – బిగ్ ఫన్” అన్న ఫార్ములా ఉంటుంది. కానీ ఈ సినిమాలో కథా తక్కువ, నవ్వు ఇంకా తక్కువ.
ప్రేక్షకుడు ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వస్తాడు, కానీ ఇక్కడ “నవ్వించే ప్రయత్నం” కన్నా “జోక్ చేయాలనే ఒత్తిడి” ఎక్కువగా కనిపిస్తుంది. దీని వల్ల ప్రతి సీన్ ఒక బలవంతపు కామెడీ డ్రిల్‌లా మారుతుంది. డైలాగులు పొడవుగా ఉన్నాయి, కానీ లోపల “రిథమ్” లేదు. ఒక మంచి కామెడీ సన్నివేశం “టైమింగ్” మీద బ్రతుకుతుంది, కానీ “మిత్ర మండలి”లో ప్రతి పాత్ర ఒకే శబ్దంతో, ఒకే టోన్‌తో మాట్లాడుతుంది.
అన్నీ లౌడ్, అన్నీ ఓవర్. ప్రేక్షకుడి చెవుల్లో శబ్దం పెరుగుతుంది కానీ నవ్వు పుడదు. కామెడీ అంటే మనకు సంబంధించిన నిజమైన చిన్న చిన్న పరిస్థితులు – ఇక్కడ అవి ఏవీ లేవు. ప్రతి సీన్ కృత్రిమం, ప్రతి జోక్ తయారీ. దాంతో సినిమా “హాస్య డ్రామా” కాకుండా హాస్య సమాధిగా మారింది.
సినిమాలో ఒక్క పాత్రకీ ఎమోషనల్ గ్రాఫ్ లేదు. ప్రతి పాత్ర నవ్వించాలనే ఉద్దేశ్యంతోనే రాయబడింది, అందుకే వాళ్లంతా ఒకే తరహాలో కనిపిస్తారు .లౌడ్, రియాక్టివ్, కానీ రియల్ కాదు. ఇలా ఉండటం వల్ల ప్రేక్షకుడు ఎవరితో కనెక్ట్ అవ్వాలో తెలియదు. నారాయణ కుల ఫీలింగ్ సీన్ –
“సామజవరగమన”లో కులశేఖర్ క్యారెక్టర్‌కి కార్టూన్ వెర్షన్‌లా కనిపిస్తుంది. అంటే పాత ట్రోప్‌ని కొత్త సినిమా పేరుతో రీప్యాక్ చేశారు అంతే.
సినిమాలో ఏదైనా తట్టుకోదగ్గది ఉంటే, అది సత్య నటన మాత్రమే. తన ఎంట్రీలోనే “I am the Important Character” అనే సాటైరిక్ లైన్ చెప్పేస్తాడు. అది కూడా irony అవుతుంది – అతనే నిజంగా సినిమా కాపాడిన important character!
సెకండ్ హాఫ్ పూర్తిగా పాత తెలుగు సినిమాల మిశ్రమం లాంటిది. డైలాగులు పొడవు, పరిస్థితులు రీపీట్, సన్నివేశాలు మళ్లీ మళ్లీ ఒకే లూప్‌లో. కథ కదలదు, జోక్‌లు ల్యాండ్ కావు, ప్రేక్షకుడు సీట్లో కదలడం మొదలుపెడతాడు.
డైరెక్టర్‌కి ఉన్న సమస్య కథ కాదు, జానర్ మీద అవగాహన లేకపోవడం. కామెడీని వ్రాయడం అంటే అబద్ధాన్ని నిజంలా చెప్పడం, కానీ ఇక్కడ నిజాన్నే అబద్ధంలా చూపిస్తున్నారు. “మేము ఫన్ మాత్రమే చేయాలనుకున్నాం” అని చెప్పడం, “మేము కథ రాయలేకపోయాం” అన్నదానికే సమానం అయింది. ఇది confidence కాదు, overconfidence.
టెక్నికల్ గా ఏ విభాగం చెప్పుకోనేటంత గొప్పగా లేవు, నిర్మాణ విలువలతో సహా.
ఫైనల్ గా…
“మిత్ర మండలి” ఒక చిన్న సూత్రం గుర్తు చేస్తుంది – “కామెడీని బలవంతంగా చేయొచ్చు, కానీ నవ్వు బలవంతంగా రాదు.”
