
బాలయ్య ‘అఖండ 2: తాండవం’ రివ్యూ
మాస్ ఉంది… మేజిక్ మాత్రం లేదు
పవిత్ర గంగను లక్ష్యంగా చేసుకున్న ప్రపంచాన్ని కదిలించే కుట్ర! భారత ఆత్మను ఛేదించాలని ఓ చైనా జనరల్ వేసిన పన్నాగం దేశాన్నే ఉలిక్కిపడేలా చేస్తుంది.
దేశంలో అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక—మహా కుంభమేళా—అదే అతడికి యుద్ధరంగం. అతని లక్ష్యం? గంగా నదిలో ప్రాణాంతక వైరస్ వదిలి— వేలాది మంది ప్రాణాలను తీసేయడం, భక్తుల విశ్వాసాన్ని భంగపర్చడం, సనాతన ధర్మంపై ప్రజల నమ్మకాన్ని దెబ్బతీయడం. దేశం శ్వాసను ఆపేసేంత తీవ్రంగా ప్లాన్ నడుస్తుంది.
ఈ అత్యవసర సమయంలో ముందుకొస్తుంది జనని (హర్షాలి మల్హోత్రా). ఆమె సైంటిస్టుల టీమ్ తో కలిసి వైరస్‌కు వ్యతిరేకంగా ప్రాణాలను రక్షించగల వ్యాక్సిన్ తయారు చేస్తుంది.
కానీ ఆ విషయం తెలుసుకున్న శత్రువులు—జననినీ, వ్యాక్సిన్నీ అంతం చేసేందుకు ఒకటవుతారు. పర్వతాలు, అడవులు, సరిహద్దులు… జనని ప్రాణం దక్కకుండా చేసే ఆపరేషన్ ని నిర్వర్తిస్తూంటారు. “అయితే ఈ దారుణాన్ని ఎవరు ఆపుతారు?”
జనని ప్రాణం ప్రమాదంలో ఉందని దేశం విశ్వాసం కూలిపోతోందని భారత ధర్మం పరీక్షలో ఉందని తెలిసిన క్షణంలో అప్పుడు ప్రత్యక్షమవుతాడు— అఖండ (నందమూరి బాలకృష్ణ). అతని ప్రవేశం ఒక్క సీన్ కాదు— దేశానికి ఇచ్చిన హామీ. ఈ క్రమంలో అఖండ ఎలా స్పందించాడు..ఎలా దేశాన్ని, జననిని రక్షించాడు అనేది మిగతా కథ.
విశ్లేషణ
అఖండకు కొనసాగింపుగా దర్శకుడు బోయపాటి శ్రీను ఈ కథను అల్లుకున్నాడు. సనాతన ధర్మం, బయోవార్, దైవత్వం ఇలా అన్ని కోణాల్లో ఆసక్తికరమైన సన్నివేశాలతో ఓ కమర్షియల్ సినిమాకు కావాల్సిన హంగులన్నీ సమకూర్చుకున్నాడు. అయితే కథకు అత్యవసరమైన స్క్రీన్ ప్లే ని మిస్సైపోయాడు.
మామూలుగా బోయపాటి శ్రీను–బాలకృష్ణ కాంబినేషన్ అంటే మాస్ ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన అంచనా ఉంటుంది. Akhanda 2 ఆ అంచనాను మొదటి 10 నిమిషాల్లోనే నిలబెట్టుకుంటుంది. అఖండ పాత్రను మొదటి భాగం నుంచి ఎలా కొనసాగించాడు, టైటిల్ మాంటేజ్ వరకు బలమైన బిల్డప్— ఇది సీక్వెల్‌కు ఒక ప్రామిస్. కానీ స్క్రీన్‌ప్లే సమస్యలు అక్కడి నుంచే కనిపించడం మొదలవుతాయి.
బలమైన స్టార్ట్, వెంటనే పడిపోయే టోన్
సినిమాలో ప్రధానమైన బయోవార్ కాన్ఫ్లిక్ట్‌ను బోయపాటి చూపించిన విధానం— అతి సాదాసీదాగా, సరిగ్గా పరిశోధనలేని WhatsApp ఫార్వర్డ్ లాంటిదిగా అనిపిస్తుంది. “When a conflict feels smaller than the stakes, tension collapses.” అన్నట్లుగా ప్రమాదం శక్తివంతంగా ఉన్నా, చూపించిన లోకం చిన్నదైతే టెన్షన్ కూలిపోతుంది చైనీస్ జనరల్ లేయర్, అతడు కుట్ర పన్నే డెన్— సెట్-డిజైన్, రాసిన సన్నివేశాలు… అన్నీ తక్కువ-స్థాయి ఫిక్షన్ అనిపించేవిగా ఉన్నాయి. అంతేకాదు, స్క్రీన్‌ప్లే అతి ప్రిడిక్టబుల్. సరియైన సస్పెన్స్ లేని కథ అనేది ఒక మాస్ సినిమాకు అతి పెద్ద లోపం.
ఇంటర్వెల్ లో కొంత పుంజుకోవడం జరిగింది. అలాగే ఇంటర్వెల్ బ్లాక్ రక్షణగా నిలిచింది. ఈ కాంబినేషన్ నుండి ప్రేక్షకులు ఎదురు చూసే సర్వైవల్ మోమెంట్ అదే. ఇంటర్వెల్ పంచ్ ఇచ్చేలా ఉండడం వల్ల “ఇంకేమైనా జరుగుతుందేమో?” అనే ఆశ పెరుగుతుంది. ఇక సెకండాఫ్ లో కొత్త క్యారెక్టర్, కొత్త థ్రెట్… కానీ అసలు ప్రయోజనం? థ్రెట్ లెవెల్ పెరుగుతుంది అనిపిస్తుంది. కానీ కొద్దిసేపటికి స్పష్టమవుతుంది— ఈ ట్రాక్ మొత్తం యాక్షన్ బ్లాక్స్ కోసం వేసిన ఫిల్లర్ మాత్రమే అని. యాక్షన్ బ్లాక్స్ బాగానే ఉన్నా, ఎందుకు జరుగుతున్నాయో? కథ ఎటువైపు సాగుతోంది? అనే ప్రశ్నలకు జవాబు లేదు.
ఇక ఆధ్యాత్మిక ఎమోషనల్ ట్రాక్‌లు— ఒక్కోటి బాగానే మొదలవుతాయి కానీ ఫైనల్‌గా ఎమోషన్ రిజిస్టర్ కాదు. ఒకటి హెవి లెక్చర్లా, మరొకటి అవసరానికి మించి సాగిందనిపించేలా అనిపిస్తాయి. “Emotion without depth is noise; action without purpose is filler.”
ఓవర్‌దటాప్ క్లైమాక్స్… మాటలు ఎక్కువ, ప్రభావం తక్కువ
క్లైమాక్స్ పెద్దదిగా చూపించాలనే ప్రయత్నం ఉంది. కానీ నారేటివ్, విజువల్స్, యాక్షన్— ఇవి అన్నీ కలిసినప్పుడు ఒక సంక్లిష్టమైన శబ్దం మాత్రమే ఏర్పడింది. ముఖ్యంగా డైలాగ్‌లు—
పాత్రలు మాట్లాడుతున్నట్టుగా కాకుండా, రచయిత అభిప్రాయాలను బయటపెడుతున్నట్టుగా అనిపిస్తాయి. ఎమోషన్ పనిచేయనప్పుడు, నారేటివ్ ఒత్తిడిని మోస్తున్నది ఒక్క బాలకృష్ణ earnest performance మాత్రమే. అది కూడా సినిమా మొత్తం నిలబెట్టడానికి సరిపోదు.
టెక్నికల్ గా..ఫెరఫార్మన్స్ పరంగా
‘అఖండ 2’కు ప్రాణం బాలకృష్ణనే. మొదటి భాగంలా ఈ సినిమాలో కూడా పూర్తి బరువుని ఆయనే మోస్తారు. పాత్రను ఆయన ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, ఆ ఎనర్జీ, బాడీ లాంగ్వేజ్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. వయసు పెరిగిన అఖండగా కనిపించే మార్పు బాగా హాండిల్ చేశారు, బాలకృష్ణ డైలాగ్ డెలివరీలో ఆ తేడాను బాగా చూపించారు.
అలాగే ‘అఖండ 2’లో చాలా పరిచితమైన నటులు ఉన్నా, ఎవరికీ గుర్తుండిపోయే పాత్ర దక్కలేదు. అందరిలో పెద్ద నిరాశ ఆదీ పినిశెట్టి. అతను కొద్దిసేపే కనిపిస్తాడు, పాత్రకు ఉన్న ఆసక్తిని వెంటనే చంపేస్తారు. సమ్యూక్త కూడా పూర్తిగా వృథా అయ్యింది—ఆమెను ఒక పాట కోసం మాత్రమే తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. బజరంగీ భాయీజాన్ సినిమాలో నటించిన హర్షాలి మల్హోత్రాకు మాత్రం పెద్ద పాత్ర ఉంది, ఆమె ఓకే చేసింది. శేశ్వతా చటర్జీ కూడా పూర్తిగా కలిసి రాలేదు.
టెక్నికల్ గా చూస్తే…
థమన్ సంగీతం అందించారు. కమర్షియల్‌గా చూస్తే, ఒక పాట తప్ప మిగతా ఆడియో పెద్దగా ఆకట్టుకోదు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌పైనే మొత్తం ఆధారపడి ఉంది, కానీ మొదటి భాగం ఇచ్చిన ప్రభావాన్ని ఇక్కడ ఆయన పూర్తిగా పునరావృతం చేయలేకపోయారు. రెండో భాగంలో BGM కొంచెం బాగున్నా, మొదటి భాగం మాత్రం సరిగ్గా పనిచేయదు.
సినిమాటోగ్రఫీ కొన్నిచోట్ల బాగుంది. ముఖ్యంగా VFX లేని సన్నివేశాల్లో విజువల్స్ క్లియర్‌గా అనిపిస్తాయి. కానీ ఓవర్–ది–టాప్ సన్నివేశాలను షూట్ చేసిన తీరు కొంచెం గందరగోళంగా ఉంటుంది. ఫాస్ట్ కట్స్ జర్కీగా కనిపిస్తాయి, సాధారణ విజువల్స్‌ని VFXతో కలపడం కూడా సాఫీగా లేకపోవడం వల్ల బాగాలేకపోయింది.
మొత్తం మీద కొంత పాత తరహా ఫీలింగ్ కనిపిస్తుంది, దాంతో పాటు డైరెక్టర్ స్టైల్ కూడా అదే వైపు తోడైంది. రాజకీయ సందేశాలను మధ్యలో కలపడం వలన రాతపై ప్రభావం పడింది.
ఫైనల్ గా…
Akhanda 2 బలంగా మొదలై, వెంటనే బలహీనపడింది. ఇంటర్వెల్ వరకు కొంత పుంజుకున్నా, రెండో భాగంలోని బ్లాక్స్ మాత్రమే కాకుండా, మొత్తం కథనానికి అవసరమైన డ్రామాటిక్ స్పైన్ కనిపించలేదు. కొన్ని సన్నివేశాలు, కొన్ని ప్రయత్నాలు బాగున్నా— సినిమాను మొత్తం హై కు తీసుకురావడానికి అవి సరిపోలేదు. ఫలితంగా—
ఫ్యాన్స్‌కి ఒక రేంజ్ వరకు ఓకే అయినా, మిగతా ప్రేక్షకులకు ఇది కేవలం ఓ సాధారణమైన, uneven sequel.
