శబ్దం తో ముడిపడిన ఓ కథకు హారర్ టచ్ ఇవ్వాలనుకునే ఆలోచనే వైవిధ్యమైయింది. ఇలాంటి కొత్త ఆలోచనతో ‘శబ్దం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆది పినిశెట్టి ఇప్పటికే తమిళంలో మంచి పేరు తెచ్చుకుని తెలగులోనూ అప్పుడప్పుడూ సినిమాలు చేస్తున్నారు. సాధారణంగా హారర్ చిత్రాలకు సౌండ్స్, విజువల్స్ ప్రాణం. ఎంత భయపెట్టారు, ఎలా కన్వీన్స్ చేసారు తమ కథతో ఇలాంటి కథలు ప్రధానం. అయితే శబ్దం ప్రధానంగా పెట్టుకోవటం విజువల్ మీడియం అయిన సినిమాకు కాస్త ఇబ్బందే. అయినా ఇలాంటి కొత్త పంధాలో వచ్చిన ‘శబ్దం’ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి ఇచ్చింది? అసలు కథేంటి
స్టోరీ లైన్
పారా నార్మల్ ఇన్వెస్టిగేటర్ గా వ్యోమ వైద్యలింగం (ఆది పినిశెట్టి)కి మంచి పేరుంటుంది. అతని ప్రత్యేకత మనుషులకు వినిపించని శబ్దాల్ని తన వద్ద ఉన్న సాంకేతిక పరికరాలతో వింటూ.. ఆత్మలతో మాట్లాడి కేసుల్ని పరిష్కరించటం. అతని దగ్గరకు ఓ డిఫెటెంట్ కేసు వస్తుంది. హోలీ ఏంజెల్ కాలేజీలో వరుసగా స్టూడెంట్లు చనిపోతుంటారు. ఆ వార్త బయటకు వచ్చి అందరినీ కంగారు పెడుతుంది. దీంతో కాలేజీ వారు ఈ కేసుని డీల్ చేసేందుకు ఘోస్ట్ ఇన్వెస్టిగేటర్ వ్యోమ వైద్యలింగం ని రంగంలోకి దించుతారు.
ఇక కాలేజీకు వచ్చిన వ్యోమ వైద్య లింగం కు అదే కాలేజీలో అవంతిక (లక్ష్మీ మీనన్) పరిచయం అవుతుంది. ఆమె అసలు దెయ్యాలు, ఆత్మలు అనేవి లేవనే విషయం ప్రూవ్ చేసేందుకు థీసిస్ చేస్తుంటుంది. కానీ అనుకోని విధంగా అవంతిక ప్రవర్తనలో ఏదో తేడా ఉందని వ్యోమ కనిపెడతాడు. దాంతో ఆ కాలేజీలోని సెంట్రల్ లైబ్రరీలోనే అవంతికపై ఓ ప్రయోగం చేయబోతాడు. అదే సమయంలో అక్కడ 42 ఆత్మలు ఉన్నట్లు అతనికి అర్దమవుతుంది. ఈ కేసు ఇలా నడుస్తూంటే దీపిక అనే మరో అమ్మాయి కూడా మరణిస్తుంది. దాంతో కేసు త్వరగా ఓ కొలిక్కి తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుంది. అప్పుడు మరింత లోతుగా అక్కడేం జరిగింది గతంలో అనే విషయమై దృష్టి పెడతాడు వ్యోమ.
ఈ క్రమంలో ఆత్మలుగా మారిన ఆ 42 మంది ఎవరనేది బయిటకు వస్తుంది. వాళ్లకు కాలేజీలో జరుగుతున్న చావులకు.. అవంతికకు ఉన్న సంబంధం ఏంటనేది అసలు కథ. అలాగే ఈ కథకు ఆ కాలేజీ మాజీ ఛైర్మన్ డాక్టర్ డయానా (సిమ్రన్)కు ఉన్న సంభందం ఏమిటి? నాన్సీ డేనియల్ (లైలా) పాత్రకున్న ప్రాధాన్యమేంటి? ఆ కాలేజ్‌లో ఏం జరిగింది? ఈ కథలో డయానా (సిమ్రాన్), డేనియల్, న్యాన్సీ డేనియల్ (లైలా) పాత్రల ప్రాధాన్యం ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
ఎలా ఉంది
సాధారణంగా హారర్ సినిమా అనేసరికి ఒకే సెటప్ లో పెట్టి కధలని చుట్టేసే ప్రయత్నం జరుగుతుంది. ఒక బంగ్లా.. అందులో ఒకటి లేదా కొన్ని ఆత్మలు దాదాపుగా అన్ని సినిమాల్లోనూ ఇదే విషయం రిపీట్ అవుతూంటుంది. దాంతో హారర్ అనగానే మన వాళ్లు చాలా రొటీన్ గా ఫీలవుతున్నారు. దాన్ని బ్రేక్ చేసే సినిమాలే వర్కవుట్ అవుతున్నాయి. అలా బ్రేక్ చేద్దామనే శబ్దం ప్రధానం గా తీసుకుని దర్శకుడు ఈ కథను రాసుకున్నాడు.
శబ్దానికి మన జీవితంలో, యుద్దంలో, వైద్యంలో ఉన్న ప్రాధాన్యతను ఈ సినిమాలో టచ్ చేసారు. ఆ మేరకు రీసెర్చ్ చేసి అందించారని అర్దమవుతుంది. అయితే ఆ పాయింట్స్ ని కథగా రూపొందించే ప్రాసెస్ సరిగ్గా జరగలేదు. శబ్దానికి, ఆత్మలని ముడిపెట్టడం సరిగ్గా సింక్ కాలేదు. దాంతో ఫస్టాఫ్ కథలో ఏదో జరుగుతోందనే పాయింటాఫ్ ఇంట్రస్ట్ అనిపించినా, సెకండాఫ్ కు వచ్చేసరికి పూర్తిగా అది మిస్సైంది. భయపడటానికి, అందులోని థ్రిల్ ఎంజాయ్ చేయడానికి టికెట్లు కొనుక్కొని మరీ వచ్చే ప్రేక్షకులును పూర్తి స్దాయిలో అలరించలేకపోయారు.
టెక్నికల్ గా
టెక్నికల్ గా మంచి స్టాండర్డ్స్ లోనే ఉంది. నేపధ్య సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ. ఆద్యంతం థ్రిల్ పంచేలా వుంది బీజీఎం. శబ్దం నేపథ్యంలో వచ్చే సీన్స్ ప్రేక్షకుల్ని భయపెట్టేలా తమన్ బాగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. అలాగే సౌండ్ డిజైనింగ్ బాగా వర్కవుట్ చేసారు. కెమెరా వర్క్ చాలా చక్కగా వుంది. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా ఉన్నాయి.
నటుడుగా ఆది పినిశెట్టి ఎప్పుడూ నిరాశపరచడు. ఈ సినిమాలోనూ చక్కగా చేసుకుంటూ పోయారు. అలాగే కథకు కీలకమైన సిమ్రాన్, లైలా పాత్రలు ఇంట్రస్టింగ్ గా డిజైన్ చేసారు. లక్ష్మీ మీనన్‌ది కూడా రెగ్యులర్ హీరోయిన్ పాత్ర కాకపోవటం ప్లస్ అయ్యింది.
చూడచ్చా
హారర్ థ్రిల్లర్ గా ఈ సినిమా కొంత భయపెడుతుంది. ఆ భయాన్ని ఎంజాయ్ చేయటానికి వెళ్లచ్చు. అయితే మరీ ఎక్కువ హారర్ ఎలిమెంట్స్ ని ఆశిస్తేనే ఇబ్బంది అంతా.