ఒకప్పుడు విజువల్ గ్రాండియర్‌కు ప్రతీకగా నిలిచిన దర్శకుడు శంకర్, ఇప్పుడు వరుస డిజాస్టర్లతో తన స్థాయిని కోల్పోతున్న సంగతి తెలసిందే. “రోబో”, “భారతీయుడు” వంటి చిత్రాలతో భారతీయ సినిమా స్థాయిని పెంచిన శంకర్, తాజాగా చేసిన ‘భారతీయుడు 2’, ‘గేమ్ ఛేంజర్’ వంటి భారీ ప్రాజెక్టులతో అంతే క్రిందకి వెళ్లిపోయారు. అవి నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చాయి. ముఖ్యంగా రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన గేమ్ ఛేంజర్ నిర్మాణం విషయంలో అనేక విమర్శలు ఎదురయ్యాయి. ఇదిలా ఉంటే తాజాగా మరో కొత్త విమర్శ షాక్ లా తగిలింది. అది మామూలుది కాదు.
గేమ్ ఛేంజర్ సినిమాకు పనిచేసిన ప్రముఖ ఎడిటర్ షమీర్ మహమ్మద్, తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ శంకర్‌పై సంచలన ఆరోపణలు చేశారు. “ఈ సినిమా మొత్తం ఏడు గంటల 30 నిమిషాల పాటు చిత్రీకరించారు. చివరికి నేను దాన్ని మూడున్నర గంటల వరకే కుదించాల్సి వచ్చింది,” అని చెప్పారు.
అలాగే మూడేళ్లు ఈ ప్రాజెక్టుపై పని చేశానని, చివరికి ఇతర ప్రాజెక్టుల దృష్ట్యా ఈ సినిమాను వదిలేశానని చెప్పిన షమీర్, శంకర్‌తో పని చేయడం చాలా చెత్త అనుభవంగా మిగిలిందన్నారు.
అంతేకాదు ఈ ప్రాజెక్టు ఖర్చులు మితిమీరిపోయినట్టు ఇండస్ట్రీ టాక్. ప్రారంభంలో ప్లాన్ చేసిన బడ్జెట్ కంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ అయిందని, దీనిపై నిర్మాత దిల్ రాజు మౌనం పాటిస్తున్నా, లోపల తీవ్ర కోపంలో ఉన్నారని సమాచారం.
గతంలో లైకా ప్రొడక్షన్స్, ఆయన దర్శకత్వంలో తీసిన 2.0, ఇండియన్ 2 లతో భారీ నష్టాలు చవిచూశాయి. పెద్ద విజన్ ఉన్నా… ప్రాక్టికల్ ప్లానింగ్ లేకపోవడం, స్క్రిప్ట్ లెవెల్‌లో మినిమల్ కాన్ఫిడెన్స్ లేకపోవడం శంకర్ సినిమాల పరాజయానికి కారణమవుతోందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.