ఆంధ్రప్రదేశ్‌లోని పడతి అనే ఓ మారుమూల గ్రామం. అక్కడ ఓ వింత ఆచారం. పెళ్లికాని అమ్మాయిలు ముఖాన్ని పరదాతో కప్పుకోవాలి! ఆ ఊరుకే చెందిన సుబ్బలక్ష్మి (అనుపమ పరమేశ్వరన్), ఈ నియమాన్ని పాటిస్తూ, తన ప్రేమికుడు రాజేష్ (రాగ్ మయూర్) తో నిశ్చితార్థానికి సిద్ధమవుతుంది. కానీ, ఓ ఫోటోగ్రాఫర్ అనుకోకుండా ఆమె ముఖాన్ని కెమెరాలో బంధించడంతో, ఆ ఫోటో మ్యాగజైన్ కవర్‌పై వచ్చేస్తుంది!
ఈ క్రమంలో గ్రామంలో గందరగోళం మొదలవుతుంది. సంప్రదాయం ప్రకారం, ఆమె బావిలో దూకి ప్రాణత్యాగం చేయాలి. సుబ్బు ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది, కానీ మిరాకల్ లాగ ఆమె బయిటపడుతుంది. దాంతో అమ్మవారు తనను కాపాడిందని నమ్మి, తనేం తప్పు చేయలేదని నిరూపించటానికి ఆ ఫొటోగ్రాఫర్ ఉన్న ధర్మశాలకు ప్రయాణమవుతుంది. అత్త రత్న (సంగీత), స్నేహితురాలు అమీ (దర్శన) సహాయంతో, సుబ్బు ఈ ప్రయాణం చెస్తుంది? ఈ ప్రయాణం ఆమె జీవితాన్ని ఎలా మలుపు తిప్పనుంది? తెలియాలంటే సినిమా చూడండి.
ఎనాలసిస్
“సినిమా బండి” , “శుభం” వంటి విమర్శకుల ప్రశంసలు అందుకున్న చిత్రాల దర్శకుడు ప్రవీణ్ కంద్రేగుల.. తాజాగా “పరదా”తో మరో ప్రయత్నం చేశాడు. “పరదా” అనే పదం హిజాబ్‌ను సూచిస్తుంది, కానీ ఈ సినిమాలో అది పితృస్వామ్య సంప్రదాయాలను, మహిళలపై మోపబడే భారాలను సూచించే సింబాలిక్ డివైస్‌గా చూపించే ప్రయత్నం చేసారు.
గ్రామంలోని వింత సంప్రదాయం – జ్వాలాంబిక అమ్మవారి శాపం కారణంగా పరదా వేయాలన్న నియమం – కథకు కేంద్ర బిందువు. కానీ, ఈ సంప్రదాయం ఆధునిక ఆంధ్రా, తెలంగాణలో ఎక్కడా లేని కృత్రిమ ఊహ. ఇరాన్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న నిజమైన పోరాటాలతో పోలిస్తే, ఈ “పరదా” సిస్టమ్ బోలుగా, కృత్రిమంగా అనిపిస్తుంది. దాంతో సినిమాలో హీరోయిన్ పోరాటం చూసేవారిలో సానుభూతిని రేకెత్తించడంలో విఫలమవుతుంది.
కథ రోడ్ ట్రిప్‌గా మారినా, బలహీనమైన రచన, సాధారణ సన్నివేశాలు, పేలవమైన ఎడిటింగ్‌తో సినిమా మధ్యస్థంగా సాగుతుంది. ఫెమినిస్ట్ టచ్ ఇవ్వాలని ప్రయత్నించినా, అది ఉపరితలంగా, బలవంతంగా కనిపిస్తుంది. “థెల్మా & లూయిస్” స్థాయి ఆశించిన వారికి ఈ సినిమా నిరాశే మిగుల్చుతుంది. చివరగా, ఈ ఊహాజనిత డ్రామా ఆకట్టుకోవడంలో పూర్తిగా విఫలమైందనే చెప్పాలి.
టెక్నికల్ గా ..
అనుపమ పరమేశ్వరన్ చక్కటి నటనతో “పరదా” సినిమాను ముందుకు నడిపించింది. చాలా సమయం పరదా వెనుక ఉన్నా, గ్రామస్తుల అన్యాయమైన డిమాండ్లను ఎదిరించే సన్నివేశాల్లో ఆమె స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సంగీత అత్త పాత్రలో ఫిట్ అయినా, రచనలో లోపం వల్ల ఆమెకు స్కోప్ తక్కువ. దర్శన రాజేంద్రన్ తొలి తెలుగు సినిమాలో నిరాశపరిచింది, రాగ్ మయూర్‌కి స్క్రీన్ టైమ్ చాలా తక్కువ. హర్ష వర్ధన్ కొన్ని నవ్వులు తెప్పించినా, హాస్యం సాధారణంగానే ఉంది.
సాంకేతికంగా సినిమా సామాన్యంగా ఉన్నా, గ్రామ జాతర మరియు దేవతా సన్నివేశాల్లో విజువల్స్, ప్రొడక్షన్ డిజైన్ కొంత ఆకర్షణీయంగా ఉన్నాయి.
ఫైనల్ గా ..
“పరదా” సినిమా మహిళల సమస్యలను, సమాజం మోపే భారాలను, తప్పుడు నమ్మకాలను బయటపెట్టాలని చూస్తుంది. అయితే, కృత్రిమమైన కథాంశం, నీరసమైన కథనం, ఆసక్తి లేని సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమవుతుంది. మంచి ఉద్దేశం ఉన్నా, ఈ డ్రామా మనసును కదిలించలేకపోతుంది, బోర్ కొడుతుంది!