అవతార్ ఫెయిల్యూరే అఖండ 2కి వరమా? కలెక్షన్లు పెరుగుతాయా?
భారీ హైప్‌తో థియేటర్లలోకి వచ్చిన ‘అఖండ 2’ రిలీజ్‌కు ముందు అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదటి భాగం సాధించిన ఘన విజయం, పాన్ ఇండియా టార్గెట్, బాలయ్య–బోయపాటి కాంబినేషన్… ఇవన్నీ కలిసి ఈ సీక్వెల్‌ను భారీ ఓపెనింగ్స్‌కి తీసుకెళ్తాయని భావించారు. కానీ సినిమా విడుదలైన తర్వాత వచ్చిన మిశ్రమ టాక్, తొలి వారంలోనే కలెక్షన్లు క్రమంగా తగ్గిపోవడం వల్ల ‘అఖండ 2’ ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ దూకుడు చూపించలేకపోయింది. ఇప్పుడు ట్రేడ్‌లో ఒకే ప్రశ్న వినిపిస్తోంది… ఈ సినిమా మళ్లీ ఊపందుకునే ఛాన్స్ ఉందా?
ఇలాంటి సందర్భాల్లో గతంలో ఎన్నో సినిమాలు రెండో వారం నుంచి పుంజుకున్న ఉదాహరణలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక పెద్ద సినిమా విఫలమైతే, అదే టైమ్‌లో నడుస్తున్న మరో సినిమా కలెక్షన్లు ఊపందుకున్న సందర్భాలు ట్రేడ్ చూసింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి ‘అఖండ 2’కు అనుకూలంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ శుక్రవారం జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన హాలీవుడ్ భారీ చిత్రం ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ థియేటర్లలోకి వచ్చింది. అయితే ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయి స్పందన రాలేదన్న టాక్ వేగంగా వ్యాపిస్తోంది. భారీ హైప్‌తో వచ్చినప్పటికీ, మొదటి రోజు రియాక్షన్ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడం వల్ల, ఇదే ‘అఖండ 2’కు కొంత ఊపిరి ఇచ్చే అంశంగా మారొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా ఈ వీకెండ్‌లో చెప్పుకోదగ్గ కొత్త తెలుగు సినిమాలు లేకపోవడం ‘అఖండ 2’కు పెద్ద ప్లస్‌గా మారింది. థియేటర్లలో తెలుగు ప్రేక్షకులకు ప్రధాన ఆప్షన్‌గా బాలయ్య సినిమా మాత్రమే ఉండటం వల్ల, రెండో వారంలో కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ భావిస్తోంది. ఇప్పటికీ చాలా ఏరియాల్లో బయ్యర్లు దాదాపు 50 శాతం రికవరీ దగ్గరే ఉన్నారని సమాచారం.
ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే… ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాకపోవడం వల్ల ఏర్పడిన ఈ ఖాళీని ‘అఖండ 2’ ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతుంది? బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ ఈ అవకాశాన్ని క్యాష్ చేసుకుని కలెక్షన్లలో గ్రోత్ చూపిస్తుందా, లేక తొలి వారపు ట్రెండ్‌నే కొనసాగిస్తుందా అన్నది వచ్చే రోజుల్లో తేలనుంది.
మొత్తానికి, బాక్సాఫీస్ దగ్గర కాస్త ఊపిరి దొరికినట్టుగా కనిపిస్తున్న ‘అఖండ 2’ రెండో వారంలో తన స్థితిని మార్చుకుంటుందా అన్నదే ఇప్పుడు ట్రేడ్‌తో పాటు ప్రేక్షకుల్లోనూ క్యూరియాసిటీగా మారింది.
