ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను మని లాండరింగ్ కేసులో Enforcement Directorate (ED) విచారించిన విషయం సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. 2018–19లో జరిగిన రామకృష్ణ ఎలక్ట్రానిక్స్ బ్యాంక్ స్కామ్ నేపథ్యంలో అరవింద్‌ను అధికారులు మూడు గంటల పాటు ప్రశ్నించి ఆయన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.
ఈ స్కామ్‌లో మనీలాండరింగ్ కోణం ఉందని అనుమానం వ్యక్తం చేసిన ఈడీ, ముందుగా ECIR నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేసింది. బ్యాంక్ లావాదేవీలు, ఆస్తుల వివరాలు తదితర అంశాలపై అరవింద్‌ను ప్రాధమికంగా విచారించిన అధికారులు, మరోసారి హాజరుకావాలని ఆయనకు సమన్లు జారీ చేశారు.
ఇప్పటికే 2024లో హైదరాబాద్, కర్నూలు, ఘజియాబాద్‌లో దాడులు నిర్వహించిన ఈడీ రూ.1.45 కోట్లు సీజ్ చేసింది. మొత్తం రూ.101.48 కోట్ల రుణ నిధులను మోసపూరితంగా ఇతర ఖాతాల్లోకి మళ్లించినట్టు నిందితులపై ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అకౌంట్ హోల్డర్లను, బ్యాంక్ యాజమాన్యాన్ని, సంబంధిత లావాదేవీలను ఈడీ అధికారులు లోతుగా పరిశీలిస్తున్నారు.
ఇందులో ప్రధానంగా, బ్యాంకు యాజమాన్యం RBI నిబంధనలను ఉల్లంఘించి నిధులను ఎలా మళ్లించిందన్న దానిపై దృష్టి పెట్టారు. ప్రస్తుతం అరవింద్ స్టేట్‌మెంట్‌తో పాటు ఇతర కీలకమైన వ్యక్తుల వివరాలను సేకరిస్తూ దర్యాప్తును కొనసాగిస్తున్నారు.