ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో తలదూర్చందే నిద్రపట్టదు కంగనాకి. అందుకే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ అంటూ ‘కంగనా రనౌత్’ని పిలుస్తూంటారు. ఆమె వివాదాస్పద విషయాలతో ఘాటైన వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా నిర్మొహమాటంగా తన అభిప్రాయాలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూంటుంది. తాజాగా సన్యా మల్హోత్ర ప్రధాన పాత్రలో నటించిన ‘మిసెస్’ సినిమా పై కంగనా రనౌత్ పరోక్ష విమర్శలు చేసింది.
జీ5 ఓటీటీ వేదికగా ప్రసారమవుతోన్న ఈ చిత్రాన్ని ఉద్దేశించి కంగనా రనౌత్ మాట్లాడుతూ.. బాలీవుడ్ చిత్రాలు వివాహ వ్యవస్థను తప్పుగా చిత్రీకరిస్తున్నాయి. ఉమ్మడి కుటుంబాల్లో ఉండే పెద్దలను తప్పుగా చూపిస్తున్నారు. అలా చేయడం మానుకోవాలి’ అంటూ కంగనా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.
అలాగే ‘ఉమ్మడి కుటుంబాల్లో ఉండే పెద్దల గురించి చెప్పాలంటే.. వారు కుటుంబానికి మానసిక ధైర్యాన్ని ఇస్తుంటారు. ఎన్నో విలువైన విషయాలు నేర్పిస్తుంటారు. మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. అందులో సందేహం లేదు. బాలీవుడ్‌లో వచ్చే ప్రేమ కథా చిత్రాలు వివాహ వ్యవస్థ గొప్పతనాన్ని తగ్గించేలా చిత్రీకరిస్తున్నారు’ అని ఆమె రాసుకొచ్చారు.
2021లో విడుదలైన మలయాళీ సినిమా ‘ది గ్రేట్ ఇండియన్ కిచెన్’కు రీమేక్‌గా ‘మిసెస్’ రూపుదిద్దుకుంది. వివాహం తర్వాత కొంతమంది యువతులకు ఎదురయ్యే ఇబ్బందుల గురించి ఇందులో చూపించారు. ఆరతి కడవ్ దీనికి దర్శకత్వం వహించారు. గతేడాది ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్‌లో ఈ చిత్రాన్ని ప్రదర్శించగా ప్రశంసలు దక్కాయి. గృహిణి పాత్రలో సన్యా మల్హోత్ర యాక్టింగ్‌ను మెచ్చుకున్నారు. ఫిబ్రవరి 7 నుంచి ఇది జీ5లో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది.