మృత పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ రూ.30,000 కోట్ల ఆస్తి ఇప్పుడు సీరియస్ డ్రామాకి కారణమైంది. సంజయ్ కపూర్ తన ఆస్తి మొత్తం రెండో భార్య ప్రియా కపూర్ కే వదిలేశారంటూ ఒక వీలునామా బయటపడింది. కానీ మొదటి భార్య, నటి కరిష్మా కపూర్ పిల్లలు – సమైరా, కియాన్ – దీనిపై సవాల్ విసిరారు. “ఇది నకిలీ” అంటూ కోర్టుకు వెళ్లారు.
పిల్లల తరఫున సీనియర్ లాయర్ మహేశ్ జెఠ్మలానీ వాదిస్తూ – “సంజయ్ మరణించిన ఏడు వారాల వరకు ఎలాంటి వీలునామా లేదని ప్రియా చెప్పింది. కానీ జూలై 30న ఒక్కసారిగా రిజిస్టర్ కాని పేపర్ చూపించారు. ఇది పూర్తిగా కల్పితం” అన్నారు.
ప్రియా కపూర్ కౌంటర్
దానికి ప్రియా తరఫు న్యాయవాది రాజీవ్ నాయర్ మండిపడ్డారు. “ప్రియా చట్టబద్ధమైన భార్య. విడాకుల కోసం కోర్టుల చుట్టూ తిరిగినవాళ్లు ఇప్పుడు ఒక్కసారిగా ప్రేమ గుర్తుచేసుకున్నారా? భర్త మృతి బాధలో ఉన్న వితంతువుపై ఇలా ఆరోపణలు చేయడం తగదు” అని వ్యాఖ్యానించారు.
అదనంగా, పిల్లలకు ఇప్పటికే రూ.1,900 కోట్ల ఆస్తులు ఆర్కే ఫ్యామిలీ ట్రస్ట్ ద్వారా వచ్చాయని కోర్టుకు తెలిపారు.
కోర్టు స్ట్రాంగ్ ప్రశ్న
న్యాయస్థానం వెంటనే అడిగింది – “వీలునామా కాపీ పిల్లలకు ఎందుకు ఇవ్వలేదు?” . ప్రియాకు నోటీసులు జారీ చేస్తూ, రెండు వారాల్లో సమాధానం ఇవ్వాలి అని ఆదేశించింది. అలాగే, సంజయ్ మరణం వరకు ఆయన పేరిట ఉన్న అన్ని ఆస్తుల వివరాలు సమర్పించాలని స్పష్టం చేసింది.
తరువాత ఏమవుతుంది?
ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 9 కి వాయిదా వేసింది. అప్పటివరకు ఫ్యామిలీ వార్ మరింత హాట్ టాపిక్ కానుంది.