ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహరాజ్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన చిత్రం ‘ఛావా’ (Chhaava) ఎంత పెద్ద సంచలనం సృష్టిస్తోందో తెలిసిందే. ఫిబ్రవరి 14న విడుదలైన ఈ చిత్రం అంతటా ప్రశంసలు దక్కించుకుంది. శంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ నటనను ప్రతిఒక్కరూ మెచ్చుకున్నారు.
లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్లతో దూసుకెళ్తోన్న సమయంలో ఊహించని విధంగా ఓ సమస్య ఎదుర్కొంది. ఈ సినిమా విషయంలో గానోజీ, కన్హోజీ షిర్కే వారసులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈక్రమంలో దర్శకుడు వారికి క్షమాపణలు చెప్పారు.
వివరాల్లోకి వెళితే… ‘ఛావా’ సినిమాలో తమ పూర్వీకులను తప్పుగా చూపించారంటూ గానోజీ, కన్హోజీ షిర్కే వారసులు ఇటీవల ఆరోపణలు చేశారు. తమ పూర్వీకులకు సంబంధించిన సన్నివేశాల్లో తగిన మార్పులు చేయకపోతే ఊరుకోమని, న్యాయపోరాటానికి సిద్ధమంటూ హెచ్చరించారు. అంతేకాకుండా, రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేస్తామని పేర్కొన్నారు. ఈమేరకు లక్ష్మణ్‌కు నోటీసులు పంపించారు.
దీనిపై స్పందించిన దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ వారి కుటుంబీకులకు ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. గానోజీ, కన్హోజీలను తప్పుగా చూపించే ఉద్దేశం తనకు ఏమాత్రం లేదని వెల్లడించారు. అందుకే వారికి సంబంధించిన వివరాలు, వారు ఏ ప్రాంతానికి చెందినవారు అనే విషయాలను సినిమాలో తాను ఎక్కడా చూపించలేదని చెప్పారు.
విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటించారు.
శంభాజీ మహరాజ్‌కు నమ్మకస్థులైన గానోజీ, కన్హోజీ.. చివరకు ఔరంగజేబుతో చేతులు కలిపి మహరాజ్ ప్రాణాలకు హాని వాటిల్లేలా చేశారని ‘ఛావా’లో చూపించారు. దీనిని వారి వారసులు తప్పు పట్టారు.