ప్రముఖ తమిళ దర్శకుడు భారతిరాజా కుమారుడు, నటుడు, దర్శకుడు మనోజ్ (48) గుండె పోటుతో చెన్నైలోని నివాసంలో మంగళవారం మరణించారు. నెల కిందట ఆయనకు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. వైద్యుల సూచనలు మేరకు ఇంట్లో ఉంటూ చికిత్స పొందుతున్న ఆయనకు మూడు రోజుల కిందట ఆరోగ్యం దెబ్బతింది.
అకస్మాత్తుగా మంగళవారం సాయంత్రం కార్డియాక్ అరెస్టుతో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య నందన, కుమార్తెలు ఆర్తిక, మదివదిని ఉన్నారు.
హీరోగా మనోజ్
తమిళంలో తండ్రి దర్శకత్వంలో 1999లో విడుదలైన ‘తాజ్‌మహాల్’ చిత్రం ద్వారా మనోజ్ హీరో గా పరిచయమయ్యారు. సినిమా ఆశించిన మేరకు ఆడకున్నా ఏఆర్ రెహమాన్ సంగీతంలోని పాటలన్నీ హిట్టయ్యాయి.
2005లో విడుదలైన ‘చాతురియన్’ చిత్రంలో తనతో నటించిన నందనను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమిళంలో ‘వరుషమెల్లాం వసంతం’, ‘సముద్రం’, ‘అల్లి అర్జున’ తదితర చిత్రాల్లో నటించినా బ్రేక్ లభించలేదు. దీంతో నెమ్మదిగా సినిమాలకు దూరయ్యారు. తర్వాత కొన్ని చిత్రాల్లో క్యారెక్టరు ఆర్టిస్టుగా నటించారు.
2022లో విడుదలైన ‘విరుమన్’ ఆయనకు చివరి చిత్రం. తండ్రి బాటలో దర్శకత్వం చేపట్టాలన్నది ఆయన ఆకాంక్ష. దర్శకులు మణిరత్నం, శంకర్ వద్ద సహాయక దర్శకుడిగా పనిచేశారు. ‘మార్గళి తింగళ్’ చిత్రం ద్వారా 2023లో దర్శకుడిగానూ పరిచయమయ్యారు. అందులో భారతిరాజా అతిథి పాత్రను పోషించడం గమనార్హం.