1990ల కాలం… ఇండియా వేగంగా మారుతున్నా, మనసులు మాత్రం పాత గోడల మధ్య చిక్కుకున్న కాలం. అలాంటి సమయంలో తమిళనాడులో ఒక చిన్న గ్రామం — అక్కడ కబడ్డీ అంటే ఆట కాదు, అస్తిత్వం. అక్కడే పుట్టాడు వనతి కిట్టన్ (ధ్రువ్ విక్రమ్) — మట్టిలో పరుగులు తీస్తూ కలలు కనేవాడు, ఒకరోజు దేశం కోసం ఆడాలనే ఆ కలతోనే జీవించేవాడు.

జాతీయ జట్టుకు ఆడాలనే కలతో శ్వాస తీసుకునే ఆ యువకుడు చివరికి జపాన్‌లో జరిగే 12వ ఏషియన్ గేమ్స్ జట్టులో చోటు సంపాదిస్తాడు. కానీ ఆ కలకు మొదటి చెయ్యి అందకముందే… దారిలో వ్యవస్థ అడ్డంగా నిలుస్తుంది. జట్టులో ఉన్నా, మైదానంలోకి అడుగుపెట్టే హక్కు లేకుండా “ఎక్స్‌ట్రా ప్లేయర్”గా బెంచ్‌పై కూర్చోవాల్సిన కిట్టన్‌కి, ఆ నిరీక్షణలో ప్రతిసెకనూ ఒక అవమానం.

ఇదే క్షణంలో అతని మనసులో ఒక్కసారిగా మెదులుతుంది ఆ పల్లె, ఆ మట్టి, ఆ దౌర్జన్యం, ఆ కులం పేరుతో వేసిన గోడలు. “నువ్వు కబడ్డీ ఆడితే నీ భవిష్యత్తు మట్టిపాలు అవుతుంది…” అంటూ హెచ్చరించిన తండ్రి వేలుసామి (పశుపతి) మాటలు కిట్టన్ చెవుల్లో మోగుతాయి. కానీ అతడు వెనక్కి తగ్గడు.

గ్రామంలో కుల వివక్ష విరుచుకుపడుతుండగా, తన కుటుంబం తిట్టబడుతుంటే కూడా, కిట్టన్ కబడ్డీని మానలేదు. అతడికి ఆట కేవలం విజయం కాదు — ప్రతిఘటన, గౌరవం, జీవితం. ఇలాంటి క్లిష్ట పరిస్థతుల్లో కూడా కిట్టయ్య కబడ్డీ ఆడుతాడు. ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే సమస్యలు ఏమిటి..? అతడు కబడ్డీలో రాణిస్తాడా..? తన గ్రామంలో ఉన్న కులవివక్షను హీరో చెరిపేస్తాడా..? చివరకు ఏషియన్ గేమ్స్ లో గెలుస్తాడా లేదా అనేది ఈ సినిమా కథ.

ఎనాలసిస్

మనతి గణేశన్ — అర్జున అవార్డు గ్రహీత కబడ్డీ ఆటగాడు — ఆయన నిజజీవిత గాథే ఈ సినిమా యొక్క హృదయం. కానీ మారి సెల్వరాజ్ దానిని బయోపిక్‌గా కాకుండా, సామాజిక శాస్త్రాన్ని సినిమాటిక్ లాంగ్వేజ్‌లో తిరిగి రాశాడు.“ఆట మనిషిని మట్టి మీద పడేస్తుంది… కానీ కులం మనిషిని మట్టిలో పాతేస్తుంది.” ఈ ఒక్క డైలాగ్‌తోనే మారి సెల్వరాజ్ సినిమా యొక్క థీసిస్ చెప్పేస్తాడు.

మారి సెల్వరాజ్ ఈసారి రియలిజం అనే బరువును గుండెల్లో మోసాడు. అందుకే “బైసన్”లో వాస్తవం ఎక్కువ, సినిమాటిక్ హై వోల్టేజ్ తక్కువ. వాస్తవాన్ని, ఎమోషన్‌ను సమపాళ్లలో చూపించాలని ప్రయత్నించడంతో కథ కొన్ని చోట్ల నడక కాదు, లాగుడు. సన్నివేశాలు పునరావృతమవుతాయి . కులం గురించి చర్చ, పగ, ప్రతీకారం, అణగారిన కేకలు. ఇవి ఒక్కోసారి దృశ్యమంతకన్నా థీమ్‌గా కనిపిస్తాయి.
దీంతో మారి సెల్వరాజ్‌ సినిమాల్లో ఉండే సహజ ఎమోషనల్ ఇంపాక్ట్ ఇక్కడ కొంచెం బలహీనమైంది.

“బైసన్”లో రెండు సినిమాలు కలిసిపోతాయి — ఒకటి స్పోర్ట్స్ డ్రామా, మరొకటి సామాజిక యుద్ధం. కానీ మారి ఎక్కడ తడబడ్డాడంటే —
ఆ రెండింటి మధ్య బ్యాలెన్స్‌లో. కబడ్డీ సన్నివేశాలు సజీవంగా ఉన్నాయి, కానీ వాటి మధ్యలో రాజకీయ, కుల ఆధారిత లేయర్లు ప్రేక్షకుడి దృష్టిని ఆట నుంచి వేరే దిశకు తిప్పేస్తాయి. స్పోర్ట్స్ డ్రామా యాంగిల్‌లో భావోద్వేగం పెంచాల్సిన చోట సామాజిక వ్యాఖ్యానం బరువు ఎక్కువైపోయింది.

టెక్నికల్ గా..

రైటర్-డైరెక్టర్‌గా మారి సెల్వరాజ్ ఈసారి ఒక డీసెంట్ సినిమా తీసుకువచ్చారు. అయితే ఇది ఆయన గత చిత్రాల స్థాయికి చేరలేదు. కథ నెమ్మదిగా సాగడం, పునరావృతమైన సన్నివేశాలు సినిమా పేస్‌ను తగ్గించాయి.

సినిమాటోగ్రాఫర్ ఎజిల్ అరసు కె. పని బాగుంది — గ్రామీణ వాతావరణం, కబడ్డీ సన్నివేశాలు సహజంగా కనిపిస్తాయి. నివాస్ కె. ప్రసన్న సంగీతం ఓకే కానీ కొన్ని చోట్ల శబ్దం ఎక్కువగా అనిపిస్తుంది. ఎడిటర్ శక్తి తిరు కొంచెం ట్రిమ్ చేసి ఉంటే సినిమా మరింత క్రిస్ప్‌గా అనిపించేది.

మొత్తానికి “బైసన్” టెక్నికల్‌గా బాగుంది కానీ ఎమోషనల్‌గా అంతగా కదిలించదు.

చూడచ్చా
ఈ సినిమా అన్ని వర్గాలకు నచ్చుతుందని చెప్పలేం..కానీ మారి అభిమానులకు మాత్రం నచ్చుతుంది

, , , , , ,
You may also like
Latest Posts from