తెలుగులో యథార్థ సంఘటనలు, నిజ జీవిత సంఘటనలు ఆధారంగా రూపొందిన సినిమాలు తక్కువ. అందుకు కారణం అవి డాక్యుమెంటరీల్లా తయారవుతాయనే భయం,అలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేని వాటిని జనం ఆదరించరనే నమ్మకం. అయితే నాగచైతన్య, అల్లు అరవింద్ మాత్రం ఆ నమ్మకాలను చెదరకొట్టాలనుకన్నారు. ఆ క్రమంలో వచ్చిన సినిమానే ‘తండేల్’. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై నాగ చైతన్య హీరోగా చేసిన ఈ సినిమా ఎలా ఉంటుంది . ఈ కంటెంట్ ఆడియన్స్ కి ఎంతవరకూ కనెక్ట్ అయిందనేది రివ్యూలో చూద్దాం.
కథేంటి
శ్రీకాకుళంలో ఓ జాలరి గూడెం. అక్కడ కుర్రాళ్లకి వృత్తి చేపల వేట. వాళ్లకు ‘తండేల్’గా .. అంటే నాయకుడిగా రాజు (నాగచైతన్య) ఉంటే చాలా ఇష్టం. అతను గత కొంతకాలంగా సత్య (సాయిపల్లవి)తో ప్రేమలో ఉంటుంది. ఆమె కూడా అతన్నే ప్రేమిస్తూ ఉంటుంది. సముద్రంలో ఎక్కువ శాతం సముద్రంలోనే ఉండే రాజుకు ఏమౌతుందనేది ఆమె భయం. అందుకే అతన్ని హెచ్చరిస్తూంటుంది.
చేపల వేట మానేయమని పోరు పెడుతూ ఉంటుంది. ఆమె ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా సముద్రం మీదకు వెళతాడు.
అలా సముద్రం మీదకు వెళ్లిన రాజు .. అతని టీమ్ తమకి తెలియకుండానే పాకిస్థాన్ సముద్ర జలాలలో ప్రవేశిస్తారు. దాంతో అక్కడి కోస్ట్ గార్డులు అరెస్ట్ చేసి, కరాచీలోని సింధ్ జైలుకు తరలిస్తారు. తర్వాత ఏమైంది? వాళ్లు ఎలా తిరిగి వచ్చారు. వాళ్లు తిరిగి రావడం వెనుక సత్య పాత్ర ఏమిటి? వంటి విషయాలు తెలియాలంటే సినిమా చూసి తెలుసుకోవాలి.
ఎనాలసిస్..
ఇది యదార్ద సంఘటనలు ఆధారంగా రాసుకొన్న కథ . దాంతో దర్శకుడు అక్కడక్కడ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని కమర్షియల్ ఎలిమెంట్స్ చొప్పించే ప్రయత్నం చేసారు. అలాగే కొన్ని చోట్ల సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ కంటే డాక్యుమెంటరీ చేసిన ఫీలింగ్ కలుగుతుంటుంది. నిజ జీవిత కథలు సినిమాలుగా తెరకెక్కిస్తున్నప్పుడు ఉండే ఇబ్బందే ఇదే కాబట్టి కొంతవరకూ సర్దుకుపోవచ్చు. ‘తండేలు’లో మొహమాటం లేకుండా అది కనిపిస్తుంది.
అయితే ఇది రాజు కథగా కంటే, సత్య(సాయిపల్లవి) కథగానే కనిపిస్తుంది. హీరోయిజం ప్రక్కన పెట్టి అలా తీర్చిదిద్దితే ఇంకా బాగుండేదేమో అనిపిస్తుంది. అప్పటికీ డైరక్టర్ మరీ దేశభక్తి తో కూడిన డ్రై ఫిల్మ్ గా మారుతోందని, దీనికో లవ్ స్టోరీ కలరింగు ఇచ్చారు. రాజు-సత్య ప్రేమ కథ చాలా మెచ్యూర్డ్ గా, అందంగా తీర్చిదిద్దాడు దర్శకుడు. సాయి పల్లవి నటన వల్ల, ప్రేమకథలో చూపించిన డిగ్నిటీ వల్ల ఆ ఎపిసోడ్ మరింత రక్తి కట్టింది. సత్య క్యారెక్టరైజేషన్ వల్ల ఈ కథకు కొత్త డెప్త్ వచ్చింది. అయితే డెప్త్ లేకపోవటం, సెకండాఫ్ లో సినిమాటెక్ ఎక్సపీరియన్స్ లేకపోవటం, ఎపిసోడిక్ నేరేషన్ లోకి వెళ్లిపోవటంతో సినిమా అనుకున్న స్దాయిలో మెప్పించదు.
టెక్నికల్ గా…
దర్శకుడుగా చందు మొండేటి లవ్ సీన్స్ మీద పెట్టిన దృష్టి మిగతా సినిమాపై పెట్టినట్లు కనపడదు. స్క్రీన్ ప్లే సరిగ్గా కుదలరేదు. కమర్షియల్ మీటర్ లో చూస్తే ఈ సినిమా అనుకొన్న ఫలితాన్ని చేరుకొంటుందా, లేదా? అనే సందేహం డైరక్టర్ ని, రైటర్స్ ని మొదటినుంచి భయపెడుతన్నట్లు అనిపిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ తన మ్యూజిక్ తో మరోసారి మ్యాజిక్ చేసారు. సెకండాఫ్ లో ఎడిటర్ మరింత షార్ప్ చేయాల్సింది. కెమెరా వర్క్ సినిమాకు పెద్ద ప్లస్ .
సాంకేతికంగా చూస్తే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంపాక్ట్‌బుల్ గా ఉంది. యాక్షన్ నేపథ్యంలో వచ్చే సన్నివేశాల్ని సహజంగా చిత్రీకరించారు. దర్శకుడు బాగానే రీసెర్చ్ చేసినట్టు అర్థం అవుతోంది. పాత్రల ద్వారా తనకేం రావాలో అది రాబట్టుకోగలిగారు. ప్రధమార్థంలో పెద్దగా కంప్లైంట్స్ లేవు. ద్వితీయార్థం మాత్రం పెద్దగా ఇంపాక్ట్ ఇవ్వదు. క్లైమాక్స్ లో మళ్లీ ఎమోషన్ టచ్ చేయగలిగాడు.
చూడచ్చా
కథలో రెడీమెడ్ కనెక్టింగ్ పాయింట్ ఉండకపోయినా పాటలు నచ్చుతాయి. అలాగే సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ మిస్ అవుతుంది. కాకపోతే ఓ జాలరి యధార్ద కథని, ఆ కోణంలోనే చూస్తే మాత్రం కచ్చితంగా ఈ సినిమా నచ్చుతుంది. సాయి పల్లవి డాన్స్ ల కోసం, దేవి మ్యూజిక్ కోసం , నాగచైతన్య నటన కోసం సినిమా ఓ సారి చూడచ్చు.