“తెలుగు సినిమాల్లో కథల కొరత లేదని, ఫ్రాంఛైజీలకు మార్కెట్ లేదని అన్నవాళ్లకి గట్టి సమాధానం చెప్పాయి ‘హిట్’ సిరీస్‌ చిత్రాలు. ఇప్పుడు అదే ఫ్రాంఛైజీ, నాని లాంటి స్టార్‌ తో ముందుకు వచ్చింది. ‘హిట్: ది థర్డ్ కేస్‌’ పేరుతో మూడో భాగంగా వచ్చిన ఈ సినిమా… అర్జున్ సర్కార్ అనే వయిలెన్స్ తో విరుచుకుపడే పోలీస్ కథను ఏ మేరకు ఇంట్రస్టింగ్ గా చెప్పింది. రిలీజ్ కు ముందే ట్రైలర్‌లు, టీజర్‌లు అంచనాలు పెంచేశాయి. ఆ అంచనాలకు తగిన రీతిలో సినిమా నిలిచిందా? శైలేష్ మూడో కేసు కథనంతో ఎమోషన్, ఇన్వెస్టిగేషన్, ఇంటెన్సిటీకి కొత్త టేస్ట్ ని చూపించాడా?”

స్టోరీ లైన్

అర్జున్ సర్కార్ (నాని) – ఓ ఐపీఎస్ ఆఫీసర్. జమ్మూ కశ్మీర్‌లోని హోమిసైడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌లో పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో అతను చాలా క్రూరమైన, కర్కశమైన హత్య కేసును ఎదుర్కొంటాడు. ఇన్విస్టిగేషన్ మొదలెట్టగానే… అదే పద్ధతిలో దేశవ్యాప్తంగా మొత్తం పదమూడు హత్యలు జరిగినట్టు బయిటకు వస్తుంది. ఒక్కొక్క హత్య ఓ దాన్ని మించి మరొకటి దారణంగా..భయానకంగా, విపరీతంగా.

అప్పుడు అర్జున్ సర్కార్ కు అర్దమవుతుంది. దీని వెనకున్నది ఒక వ్యక్తి కాదు – ఓ వ్యవస్థ, ఓ నెట్‌వర్క్ అని. ఈ కేసును ఛేదించేందుకు అతను బీహార్ నుంచి గుజరాత్ వరకూ అంతా గాలిస్తాడు. కానీ, కేసు కొత్త టర్న్ తీసుకునే లోపే, అతన్ని విశాఖపట్నానికి బదిలీ చేస్తారు.

అక్కడకి వచ్చిన తరువాత కూడా అతని ఇన్విస్టేషన్, ఫైట్ ఆపడు. ఈ కేస్ ని ఓ కొలిక్కి తెచ్చేందుకు ఓ మాస్టర్ ప్లాన్ వేసి రంగంలోకి దూకుతాడు. అప్పుడు ఏమైంది. ఆ ప్లాన్ సక్సెస్ అయ్యిందా ? ఈ హత్యల వెనుక దాగి ఉన్న చీకటి కోణాలేమిటి? ఇది కేవలం హత్యల కథేనా, లేక మనుషుల్ని వినియోగించే దుర్మార్గ వ్యూహమా? అలాగే ఈ కథలో మృదుల (శ్రీనిధి శెట్టి) పాత్ర ఏమిటి? వంటివన్నీ తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాలసిస్ :

శైలేష్ కొలను రూపొందించిన ‘హిట్’ ఫ్రాంఛైజీలో ఇప్పటి వరకూ వచ్చిన రెండు సినిమాలు ఇన్విస్టిగేషన్ యాంగిల్ మీదే ఆధారపడినవే. కానీ ‘ది థర్డ్ కేస్’ అనే మూడో కథ మాత్రం దాన్ని మించిపోయింది – ఒక మానవతా ప్రశ్నను తెరమీదకి తెచ్చింది. ఓ క్రైమ్ ను ఛేదించడమే కాదు… అలా క్రైమ్ జరుగేలా చేసే వ్యవస్థను గోప్యంగా ఆవిష్కరించడమే దర్శకుడి లక్ష్యం. అయితే అదే సమయంలో మితిమీరిన హింసను సైతం ప్రొజెక్ట్ చేసింది.

నెమ్మదిగా భయపెట్టే, రక్తపాతంతో ఒక చీకటి ప్రపంచాన్ని తెరపై చూపించిన విధానం వికారాన్ని కలిగించేలా ఉంది. ముఖ్యంగా నానిలాంటి ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న నటుడిని చూసే ప్రేక్షకులుకు – ఈ హింసాత్మక కథనం కాస్త అసహజంగా అనిపించొచ్చు. కొన్నికొన్ని సన్నివేశాల్లో హింసకు కేవలం కారణం చూపించడమే కాదు, దానిని ఎలివేట్ చేస్తూ చూపించిన తీరు కూడా ఇబ్బంది పెట్టేలాగ ఉంది.

అయినా కూడా… సినిమాకు ఓ బలమైన బేస్ ఉంది. అర్జున్ సర్కార్ అనే పాత్రలో నాని – ఈసారి రక్తం ఉడికిపోయే పోలీస్ లా కనిపించాడు . అతనిలోని మాస్ యాంగిల్ ‘దసరా’తో మొదలై, ఇక్కడ మరింత బలంగా కనిపించింది. ఓ చక్కటి ఫ్యామిలీ ఎమోషన్స్ లోనే కాదు… బీభత్సమైన యాక్షన్ సీన్స్ లో కూడా నాని నిరూపించుకోగలడని ఈ సినిమా మరోసారి చూపించింది.

సినిమాలో మొదటి భాగం కొంచెం నెమ్మదిగా సాగినట్టు అనిపించినా, కథలో ఉండే అసలు గట్టి మలుపులు రెండో భాగంలో ఒక్కొక్కటిగా తెరపైకి వస్తాయి. అర్జున్ ఓ సీక్రెట్ నెట్‌వర్క్‌ను కనుగొంటున్న సన్నివేశాలు, అతను ఆ సైకో ప్రపంచంలో అడుగుపెట్టిన తర్వాత జరిగే సంఘటనలు – సినిమాలో అత్యంత ఉత్కంఠభరిత ఘట్టాలు. గేమ్, స్టైల్ యాక్షన్ సీక్వెన్సులు ప్రేక్షకులను ఒక రకమైన మానసిక ఒత్తిడిలోకి తీసుకెళ్తాయి.

కథనం అనేక హాలీవుడ్ థ్రిల్లర్లను తలపించినా, స్కిడ్ గేమ్ సీరిస్ ని గుర్తు చేసినా చాలా వరకూసఫలమైంది. అయితే సినిమాలో ప్రధాన లోపం మాత్రం భావోద్వేగాల కొరత. ఈ కథలో వ్యక్తిగత బాధ, తల్లి-కొడుకుల అనుబంధం, మృదుల రిలేషన్ ఇవన్నీ ఉన్నా, అవి అర్ధాంతరంగా మిగిలిపోయాయి.

టెక్నికల్‌గా చూసినప్పుడు

సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ కథ టోన్‌కు తగినట్టే ఉన్నాయి. Squid Game తరహా ఆర్ట్ డిజైన్‌లను బాగా క్యాప్చర్ చేశారు. డైరెక్టర్ శైలేష్ కొలను తన వైద్యవృత్తి నేపథ్యాన్ని ఉపయోగించి, కథలో కొన్ని మెడికల్ ఎలిమెంట్స్ బాగా కలిపారు. చాలా వరకూ వయలెన్స్‌ తో నింపేసినా దాన్ని ‘న్యాయమైన’ది అనిపించేలా చూపించారు.

మిక్కీ జే మేయర్ సంగీతం బాగుంది కానీ. కానీ మెమరబుల్ అనిపించదు. నిర్మాణంగా చూసుకుంటే స్వంత బ్యానర్ తో కలసొచ్చిన ప్రొడక్షన్ వాల్యూస్ సినిమాకు గ్రాండ్ లుక్ ఇచ్చాయి. కానీ మధ్య మధ్యలో కథ పట్టు తప్పినట్టు అనిపిస్తుంది. కొన్ని చోట్ల డ్రాగ్ అయిందన్న ఫీల్ వస్తుంది.

నటీనటుల్లో ..

నాని పెర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ పాత్రలో పూర్తిగా లీనమై, ఆ పాత్రే అయిపోయాడు. సినిమా మొత్తం మీద అదే అసలైన డ్రైవింగ్ ఫోర్స్ నానీనే. శ్రీనిధి శెట్టి పాత్ర తక్కువగానే మిగిలింది. ఆమెకు పెద్దగా చేయడానికి ఏం లేదు.విలన్ బిల్డప్ బాగుంది, కానీ ఆ క్యారక్టరైజేషన్ మాత్రం పక్కాగా రాలేదు. మిగిలిన సపోర్టింగ్ క్యారెక్టర్స్ కూడా అంతగా గుర్తుండిపోయేలా లేరు. మొత్తంగా చూస్తే – ఇది నాని మోసిన సినిమా.

ఫైనల్ గా …

‘హిట్ 3’ సమాజాన్ని హెచ్చరించే ఓ అనుభవం. ఇది కేస్‌ ఛేదించే కథ కాదు… మనుషుల్ని మానవత్వం నుంచి మానవహింస వైపు నడిపించే శక్తులపై సినిమా వేసిన ప్రశ్న. అలాంటి బోల్డ్ అడుగులో నాని నడిచిన తీరే సినిమాకి మెయిన్ హైలైట్.

వయలెన్స్ తో కూడిన క్రైమ్ థ్రిల్లర్స్ ను ఇష్టపడే వారికి హిట్ 3 నచ్చుతుంది

సంస్థ‌: వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ ప్రొడక్షన్స్
నటీనటులు: నాని, శ్రీనిధి శెట్టి, రావు ర‌మేశ్‌, ప్రతీక్‌ బబ్బర్‌, సూర్య శ్రీనివాస్‌, అదిల్ పాలా, కోమలి ప్రసాద్‌, మాగంటి శ్రీనాథ్‌, రవి మరియా, సముద్రఖని త‌దిత‌రులు;
సినిమాటోగ్రఫీ: సాను వర్గీస్‌;
సంగీతం: మిక్కీ జె మేయర్;
కూర్పు: కార్తీక శ్రీనివాస్
ఆర్ట్; ప్రొడక్షన్ డిజైన్‌: శ్రీ నాగేంద్ర తంగాల;
నిర్మాత: ప్రశాంతి త్రిపుర్నేని;
రచన, దర్శకత్వం: డా.శైలేష్ కొలను;
విడుద‌ల‌: 01-05-2025

, , , , ,
You may also like
Latest Posts from