ఎంతటివారికైనా వారి జీవితాల్లో కొన్ని మర్చిపోలేని సంఘటనలు ఉంటాయి. అవి వాళ్ల జీవితంపై చాలా ప్రభావం చూపిస్తాయి. అలాంటి ఓ సంఘటన తన జీవితంలో ఉందంటున్నారు హీరో. ప్రస్తుతం ‘హిట్ 3’ అందించిన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు హీరో నాని. తాజాగా, ఓ పాడ్‌కా్‌స్టలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఓ ప్రమాదం తన జీవితాన్నే మార్చేసిందని తెలిపారు…
నాని మాట్లాడుతూ… ‘‘నేను నా మొదటి కారును కొనకముందు ఓ ప్రమాదం జరిగింది. నా మిత్రుడి కారులో లాంగ్‌డ్రైవ్ వెళ్లాం. చీకటిలో నేను నడుపుతున్న కారు రోడ్డుపై నిలిచిపోయి ఉన్న ఓ లారీని ఢీకొట్టింది. నాకూ, నా పక్కనే ఉన్న ప్రశాంత్ అనే మిత్రుడికీ తీవ్ర గాయాలయ్యాయి. ప్రశాంత్ స్పృహ కోల్పోయాడు. ప్రశాంత్.. ప్రశాంత్ అని గట్టిగా అరవడంతో ఆయన స్పృహలోకి వచ్చాడు. దాంతో ఊపిరి పీల్చుకున్నా.
చికిత్స కోసం ఓ అంబులెన్స్‌లో హాస్పిటల్‌కు వెళ్తుంటే దారిలో మరో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో ఓ కుటుంబమంతా తీవ్రంగా గాయపడ్డారు. అందులో ఓ చిన్న పాప కూడా ఉంది. మాతో పాటూ వారినీ అంబులెన్సులో తీసుకుని ఆస్పత్రికి వెళ్లాం. ఆ పాపను ఐసీయూలో ఉంచారు.
అర్థరాత్రి నుంచి ఉదయం వరకూ ఆ పాప పరిస్థితి తెలుసుకోవడానికి నేను వేచి చూశా. మరణం అంచులకు తీసుకెళ్లిన ఆ రాత్రి నన్ను పూర్తిగా మార్చేసింది. జీవితాన్ని చూసే కోణాన్ని, పలు విషయాలకు స్పందించే విధానాన్ని నేర్పింది’’ అని పేర్కొన్నారు.