రజనీకాంత్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన మ్యాజిక్ ఉంటుంది — ఆ బజ్‌, ఆ హైప్‌, ఫ్యాన్ థియరీల వర్షం. ఇప్పుడా అంచనాలు, ఆ ఉత్సాహం అన్నీ రెట్టింపు అయ్యాయి, ఎందుకంటే ఆయన తాజా చిత్రం కూలీ, దర్శకుడు లోకేష్ కనగరాజ్‌తో వచ్చింది. అయితే అదే సమయంలో రిలీజ్ కు ముందు ప్రేక్షకుడు మనస్సులో కొన్ని ప్రశ్నలను సంధించింది. అవేంటంటే “కూలీ” కూడా ఆయన ఎంతో ప్రశంసలు అందుకున్న LCU లో భాగమా? లేక కమల్ హాసన్‌తో చేసిన బ్లాక్‌బస్టర్ విక్రమ్‌తో ఏమైనా కనెక్షన్ ఉందా? నాగార్జున్ ని నెగిటివ్ పాత్రలో చూపెడితే ఫ్యాన్స్ ఒప్పుకుంటారా, అమీర్ ఖాన్ చేత ఎలాంటి క్యారక్టర్ చేయించారు అని. — ఇలాంటి అనేక ఆలోచనలు నా మనసులో తిరుగుతూనే నేను కూలీ కోసం థియేటర్‌కి అడుగుపెడుతున్నాను.మరి ఎలా ఉందో చూద్దాం.

స్టోరీ లైన్

వైజాగ్ పోర్ట్‌ను ప్రభుత్వం నుంచి 99 ఏళ్ల లీజుకు తీసుకున్న లాజిస్టిక్స్ కింగ్‌పిన్ సైమన్‌ (నాగార్జున) డాన్‌. స్మగ్లింగ్ నుంచి హత్యల వరకు అన్నీ అతడి ఆట. పోర్టులో జరిగే ప్రతీ వ్యవహారాన్ని కంట్రోల్ చేసే అతని నమ్మిన రైట్ హ్యాండ్ దయాల్‌ (సౌబిన్‌ షాహిర్‌). ఎవడైనా లోపల జరుగుతున్న రహస్యాల్ని బయటపెట్టాలని ప్రయత్నిస్తే, దయాల్ వెంటనే గుర్తించి, అక్కడిక్కడే చంపేస్తాడు.

కాని సమస్య — ఆ శవాల్ని ఎలాంటి సాక్ష్యం మిగలకుండా మాయం చేయడం. ఇంతలోనే రాజశేఖర్‌ (సత్యరాజ్) కనిపెట్టిన మొబైల్ క్రిమేటర్ కుర్చీ గురించి సైమన్‌కి సమాచారం అందుతుంది. మృతదేహాలను సాక్ష్యం లేకుండా బూడిద చేయగల ఈ పరికరాన్ని చూసి సైమన్ కళ్ళల్లో మెరుపులు. రాజశేఖర్‌కి తనతో పని చేయమని ఆఫర్ ఇస్తాడు. తిరస్కరిస్తే, అతని ముగ్గురు కూతుళ్లను చంపేస్తానని బెదిరిస్తాడు.

కుటుంబాన్ని రక్షించుకోవడానికి రాజశేఖర్‌, తన కూతురు ప్రీతి (శ్రుతి హాసన్)తో కలిసి ఆ క్రిమినల్ ఆపరేషన్‌లో చేరతాడు. కానీ కొద్ది రోజుల్లోనే అనూహ్యంగా రాజశేఖర్ హత్యకు గురవుతాడు. ఇక్కడే ఎంట్రీ ఇస్తాడు అతని ప్రాణ స్నేహితుడు దేవా (రజనీకాంత్). రాజశేఖర్‌ను చంపిన వారిని ఏ ధర అయినా వెతికి పట్టి తుదముట్టించాలనే ప్రతిజ్ఞతో వేట మొదలుపెడతాడు.

మరి తర్వాత ఏం జరిగింది? దేవా నిజంగా ఎవరు? అతని గతం ఏమిటి? పోర్ట్‌లో స్మగ్లింగ్ వెనక సైమన్ నడుపుతున్న అసలు భారీ దందా ఏంటి? దీన్ని విదేశాల్లో ఉన్న దాహా (ఆమీర్ ఖాన్)తో కలిపే లింక్ ఏమిటి? ఈ కథలో కాళేశ్‌ (ఉపేంద్ర), కల్యాణి దయాలన్‌ (రచిత రామ్‌), అర్జున్‌ సైమన్‌ (కన్న రవి) పాత్రల అసలు రూపం ఏమిటి? — అన్నీ థియేటర్‌లో తెలుసుకోవాలి.

విశ్లేషణ

దర్శకుడు లోకేష్ కనగరాజ్‌ ఇప్పటికే కమల్ హాసన్‌, విజయ్‌లాంటి టాప్‌ స్టార్లతో పనిచేసి, తనకంటూ ఓ ప్రత్యేకమైన స్టైల్‌ని ఏర్పరుచుకున్నాడు. స్టార్‌ సినిమాలను తన ముద్రతో ప్యాకేజ్‌ చేసే లోకేష్ ఫార్ములా వల్లే రజనీకాంత్‌తో ఆయన కాంబినేషన్‌ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

కానీ కూలీ మొదటి నుండి చివరి వరకు రైటింగ్‌, డైరెక్షన్‌ రెండింట్లోనూ సగటు స్థాయి కంటే మించి ఏమీ ఇవ్వలేని సాదా సీదా ప్రయత్నంగా మిగిలిపోయింది. విక్రమ్లో సూర్యా కామియో ఎలా ఎగ్జైట్‌ చేసిందో గుర్తుందా? ఇక్కడ అలాంటి కామియోలు గిమ్మిక్‌లుగా మాత్రమే కనిపిస్తాయి.

క్లియర్ గా చెప్పాలంటే కూలీ ఓ రివెంజ్ డ్రామా. లోకేష్, విలన్‌ గ్యాంగ్‌ ఎంట్రీతో స్టార్ట్‌ చేస్తాడు. వాళ్లు ఏదో వింత స్మగ్లింగ్ ఆపరేషన్‌లో ఉన్నారని హింట్ ఇస్తాడు. తర్వాత రజనీకాంత్‌ క్యారెక్టర్‌ని తీసుకువచ్చి, అతని స్నేహితుడి మరణంతో స్టోరీని కట్టిపెట్టి, విలన్స్‌ సైమన్‌ (నాగార్జున), దయాల్‌లతో కాంఫ్రంటేషన్ సెట్ చేస్తాడు. ఈ మొదటి 40 నిమిషాలు బాగానే ఎంగేజ్ చేస్తాయి.

కానీ… గ్యాంగ్ అసలు స్మగ్లింగ్ కాదు, ట్రాఫికింగ్‌లో ఉన్నారని తెలిసిన వెంటనే కొత్తదనం చచ్చిపోతుంది. ట్రాఫికింగ్ యాంగిల్ అంటే పాతకాలం నుంచి వాడిన ట్రోప్ — రజనీకాంత్ కెరీర్‌ అంత పాతది.

దాని తర్వాత సినిమా రెండు ట్రాక్‌లలో నడుస్తుంది — స్నేహితుడి మరణం వెనుక నిజం వెతికే రజనీ, తన కూతురి కోసం వెతికే రజనీ. రెండూ లీనయర్ గా సాగుతాయి, కానీ మాస్ హై పాయింట్లు రాకుండా డ్రాగ్ అవుతాయి. మూడున్నర దశాబ్దాల క్రితం కూలీగా రజనీ ఫ్లాష్‌బ్యాక్ అనుకున్నంత ఇంపాక్ట్ ఇవ్వదు. ఎందుకంటే అది విజువల్ గా చెప్పరు. రెండో హాఫ్‌లో సిల్లీ సిట్యుయేషన్స్‌, ఈజీ ప్లాట్ టర్న్స్‌, ఎమోషనల్ లేదా న్యారేటివ్ గ్రిప్ లేకపోవడం బాగా తగులుతాయి. ఈ పార్ట్‌లో కొంచెం హుషారెత్తించే విషయం అంటే రచితా రామ్‌ క్యారెక్టర్‌, దానికి సంబంధించిన ట్విస్ట్ మాత్రమే.

కూలీ లో లోకేష్ బలహీనతలు బయటపడతాయి — స్టార్ పవర్‌పై ఎక్కువ ఆధారపడటం, అనిరుధ్‌ మ్యూజిక్‌పై మరీ ఎక్కువ నమ్మకం, అవసరం లేని స్టార్ కామియోలు. అనిరుధ్ మ్యూజిక్ కొన్ని సీన్స్‌ని లిఫ్ట్ చేసినా, ఎక్కడికక్కడ లౌడ్‌గా, కేకల మాదిరిగా అనిపిస్తుంది. ఆమీర్ ఖాన్‌, ఉపేంద్ర కామియోలు బలవంతంగా చేసినట్లే అనిపిస్తుంది. వాళ్లు రజనీకి గౌరవం కోసం చేసారేమో అనిపిస్తుంది, కానీ రోల్స్ మాత్రం కారికేచర్‌లా ఉంటాయి.

పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే —

రజనీకాంత్ తన స్టార్ పవర్‌, మ్యాగ్నటిక్ చార్మ్‌తో సినిమాని మోస్తాడు. హెయిర్ స్టైల్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు స్టైలింగ్ “జైలర్” రేంజ్‌లోనే ఉంది. నటనలో ఎక్కువగా సటిల్డ్ గా ఉంటూ, రోల్‌కి పూర్తిగా ఫిట్ అయ్యాడు. శ్రుతి హాసన్‌కి బాగా డిఫైన్ చేసిన క్యారెక్టర్ ఇచ్చి, ఆమె తన బెస్ట్ యాక్టింగ్ అందించింది.

దురదృష్టవశాత్తు ‘కింగ్’ నాగార్జున ఇక్కడ ‘కింగ్‌పిన్’లా — స్ట్రైట్‌, వన్ డైమెన్షనల్ విలన్ రోల్‌లో కనబడతాడు. సత్యరాజ్ సరిపడా చేశాడు, కానీ సౌబిన్ షాహిర్ తన రోల్‌ని పూర్ ఎంజాయ్ చేస్తూ, ఎక్స్‌ప్రెషన్స్‌తో పండగ చేశాడు. రచితా రామ్ రెండో హాఫ్‌లో మంచి సర్‌ప్రైజ్‌గా నిలిచింది.

టెక్నికల్‌గా…

అనిరుధ్ మ్యూజిక్ మళ్లీ హైలైట్ అయినా, లౌడ్‌నెస్ తగ్గితే బాగుండేది. మిగతా టెక్నికల్ టీమ్ పని బాగానే చేసినా, ఎక్కువైన రన్‌టైమ్ కట్ చేయాల్సింది. రైటర్‌గానూ, డైరెక్టర్‌గానూ లోకేష్ ఇక్కడ వీక్ అవుట్‌పుట్ ఇచ్చాడు. లియో లో ఉన్న “సెకండ్ హాఫ్ సిండ్రోమ్” నుంచి పాఠం నేర్చుకోలేదనే ఫీలింగ్ మిగిలిపోతుంది.

ఫైనల్ థాట్:

కూలీ మొదటి 40 నిమిషాల వరకు లోకేష్‌ స్టైల్‌, రజనీ మాస్ రెండూ బాగానే కలిసొచ్చాయి. కానీ తర్వాత పాత ట్రోప్స్‌, లాజిక్ లేని సన్నివేశాలు, డ్రాగ్ అయ్యే స్క్రీన్‌ప్లే వల్ల ఇంపాక్ట్ తగ్గిపోయింది. రజనీ స్టార్ పవర్‌, కొన్ని ట్విస్టులు, అనిరుధ్ మ్యూజిక్ తప్ప, మిగతా సినిమా “మాస్ ఎంటర్‌టైనర్” లెవెల్‌కి చేరలేదు. ఫ్యాన్స్ కోసం ఒక్కసారి చూసే సినిమా, కానీ లోకేష్ నుంచి ఆశించిన రేంజ్ మాత్రం మిస్ అయింది.

, , , , , , , ,
You may also like
Latest Posts from