‘ధమాకా’ తర్వాత రవితేజకు సోలోగా ఒక్కటంటే ఒక్క సరైన హిట్ లేదు. ‘వాల్తేరు వీరయ్య’ హిట్టయినా అది మెగాస్టార్ ఖాతాలోకి వెళ్ళిపోయింది. ఆ తర్వాత వచ్చిన ‘టైగర్ నాగేశ్వరరావు’, ‘రావణాసుర’, ‘ఈగల్’, ‘మిస్టర్ బచ్చన్’ లాంటి సినిమాలు తీవ్ర నిరాశ పరిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో ‘మాస్ జాతర’ మూవీపై అభిమానులంతా బోలెడన్ని ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ బయిటకు వచ్చింది.
తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నిర్మాత నాగవంశీ (Nagavamsi) ‘మాస్ జాతర’ రిలీజ్‌పై కీలక అప్ డేట్ ఇచ్చారు. జులైలోనే ఈ సినిమా రిలీజ్ చేస్తున్నట్లు చెప్పారు. తాజాగా జులై 18న సినిమా రిలీజ్ కానుందనే టాక్ వినిపిస్తోంది.
నిజానికి మే 9నే సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. కొత్త విడుదల తేదీపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది.
రవితేజ హీరోగా సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న సినిమా ‘మాస్ జాతర’. భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.