బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ ‘ఏక్ థా టైగర్’ ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో కొత్త రికార్డు సృష్టించింది. వాషింగ్టన్ డీసీలోని ఇంటర్నేషనల్ స్పై మ్యూజియం లో ఈ సినిమా పోస్టర్‌ను ప్రదర్శించారు. జేమ్స్ బాండ్, మిషన్ ఇంపాజిబుల్ వంటి లెజెండరీ స్పై సినిమాల సరసన నిలిచిన తొలి భారతీయ చిత్రం ఇదే కావడం గర్వకారణం.
దర్శకుడు కబీర్‌ఖాన్ ఈ సందర్భంగా తన ఆనందాన్ని వ్యక్తం చేస్తూ – “సినిమా విజయాన్ని కేవలం బాక్సాఫీసు లెక్కలతో కొలవలేం. ఎన్ని సంవత్సరాలు ప్రేక్షకుల మదిలో నిలిచిపోతుందనేది అసలైన గుర్తింపు. ‘ఏక్ థా టైగర్’ ఇప్పటికీ చర్చల్లో ఉండటం నాకు సంతోషంగా ఉంది” అన్నారు.
2012 ఆగస్టు 15న విడుదలైన ఈ చిత్రం రూ.75 కోట్ల బడ్జెట్ తో రూపొందినా, రూ.330 కోట్లకుపైగా వసూలు చేసి భారీ హిట్‌గా నిలిచింది. సల్మాన్‌ఖాన్ రా ఏజెంట్‌గా, కత్రినా కైఫ్ ఐఎస్ఐ ఏజెంట్‌గా చేసిన నటన ప్రేక్షకులను మంత్ర ముగ్ధులను చేసింది.
యశ్‌రాజ్ ఫిల్మ్స్ క్రియేట్ చేసిన YRF స్పై యూనివర్స్ లో ఇదే మొదటి అడుగు. ఆ తరువాత ‘టైగర్ జిందా హై’, ‘వార్’, ‘పఠాన్’, ‘టైగర్ 3’ సినిమాలు వరుసగా వచ్చి కలెక్షన్లలో సెన్సేషన్ సృష్టించాయి. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కాంబోలో వచ్చిన ‘వార్ 2’ ఈ స్పై యూనివర్స్‌కి మరో మైలు రాయి.
సల్మాన్‌కి, బాలీవుడ్‌కే కాదు భారతీయ సినిమాకి కూడా ఇది అంతర్జాతీయ గౌరవం అని చెప్పాలి.