బాలీవుడ్ నటి ఊశ్వరి రౌటెలా ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఆమె వ్యాఖ్యలపై ఆలయ అర్చకులు, పూజారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తన వ్యాఖ్యలను వాళ్లు సరిగ్గా అర్దం చేసుకోలేదని అంటోంది. ఈ మేరకు టీమ్ వివరణ ఇచ్చింది.
అసలేం జరిగింది
తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ హాట్ బాంబ్ ఊర్వశి రౌటేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ‘‘ఉత్తరాఖండ్ లో నా పేరు మీద గుడి ఉంది. బద్రినాథ్ కు వెళ్లేవాళ్లు ఎవరైనా ఆ పక్కనే ఉన్న నా గుడిని దర్శించొచ్చు. ఇక ఢిల్లీ యూనివర్సిటీలో స్టూడెంట్స్ నా ఫొటోను పూలతో పూజిస్తారు. అది తెలిసి షాకయ్యా. కానీ నిజం’’ అని ఊర్వశి పేర్కొంది.
ఉత్తరాఖండ్ లో గుడితో ఆగని ఊర్వశి సౌత్ ఇండియాలో ఫ్యాన్ బేస్ గురించి మాట్లాడింది. ‘‘సౌత్ లోనూ నాకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. నా పేరు మీద సౌత్ ఇండియాలో రెండో గుడి కడతారనే నమ్మకంతో ఉన్నా’’ అని ఊర్వశి చెప్పడం గమనార్హం. అంతే కాకుండా అన్ని గుళ్లలో జరిగినట్లే.. తన టెంపుల్ లోనూ భక్తులు ఆశీర్వాదాలు తీసుకుంటారని ఆమె పేర్కొనడం వివాదానికి దారి తీసింది.
బద్రినాథ్ లో ఉండే స్థానిక పూజారులు కూడా ఊర్వశిపై మండిపడుతున్నారు. బామ్నికి సమీపంలో ఊర్వశి టెంపుల్ ఉందని, కానీ అది ఈ యాక్టర్ కు ఏ మాత్రం సంబంధించింది కాదని చెబుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసిన ఊర్వశిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
టీమ్ క్లారిటీ
ఊర్వశి వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున కాంట్రవర్సీ రేగడంతో ఆమె టీమ్ క్లారిటీ ఇచ్చింది. వితండ వాదంతో కూడిన వ్యాఖ్యలు చేసింది. ‘‘ఊర్వశి ఆ వీడియోలో తన పేరు మీద ఆలయం ఉందని చెప్పింది. అంతే కానీ అది తన గుడి అని చెప్పలేదు. ఆమె వ్యాఖ్యలనూ అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారు. వీడియోను మరోసారి చూడాలి. ఢిల్లీ యూనివర్సిటీలో నిజంగానే ఆమె ఫొటోకు దండలు వేసి పూజిస్తారు. మాట్లాడే ముందు నిజాలు తెలుసుకోవాలి’’ అని ఊర్వశి టీమ్ పేర్కొనడం గమనార్హం.