ప్రతీ పెద్ద సినిమాని రెండు పార్ట్ లు గా విడుదల చేసి డబ్బులు చేసుకోవటం నిర్మాతలు అనుసరిస్తున్న వ్యూహం. అదే కోవలో విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టించిన ‘కింగ్ డ‌మ్‌’ కూడా రెండు భాగాలుగానే విడుద‌ల చేస్తున్నార‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే ఈ విషయమై విజయ్ క్లారిటీ ఇచ్చారు.

రౌడీబాయ్‌ విజయ్ దేవరకొండ హీరోగా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు గౌతమ్ తిన్ననూరి డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కుతున్న తాజా యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘కింగ్‌డమ్‌’. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యాన‌ర్ల‌పై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. విజ‌య్ స‌ర‌స‌న హీరోయిన్‌గా భాగ్య‌శ్రీ బోర్సే న‌టిస్తుండ‌గా.. యువ సంగీత ద‌ర్శ‌కుడు అనిరుధ్ ర‌విచంద‌ర్ బాణీలు అందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్న నేపధ్యంలో సినిమా గురించిన విషయాలు బయిటకు వస్తున్నాయి.

ఈ నేపధ్యంలో ఓ త‌మిళ మీడియాకు విజ‌య్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘కింగ్ డ‌మ్‌’ రెండు భాగాలా? అనే ప్ర‌శ్న ఎదురైంది. దీనికి విజ‌య్ చాలా స్ప‌ష్ట‌మైన స‌మాధానం ఇచ్చారు. ద‌ర్శ‌కుడు గౌత‌మ్ తిన్న‌నూరి త‌న‌కు ఈ సినిమా ఒకే క‌థ‌లా చెప్పార‌ని, అలాగే తీశామ‌ని, కానీ ఈ క‌థ‌కు చాలా స్పాన్ ఉంద‌ని, ‘కింగ్ డ‌మ్‌’కు ముందు ఏం జ‌రిగింది? త‌ర‌వాత ఏం జ‌ర‌గ‌బోతోంది? ఈ క‌థ‌లోని మిగిలిన పాత్ర‌లు ఎలా ప్ర‌వ‌ర్తిస్తాయి? అనేది చాలా విస్త్రృత‌మైన విష‌య‌మ‌ని అన్నారు.

ఆ పాత్రలు చుట్టూ భ‌విష్య‌త్తులో మ‌రిన్ని భాగాలు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే.. ప్ర‌తీ భాగంలోనూ తానే హీరోగా క‌నిపించాల్సిన అవ‌స‌రం లేద‌ని, క‌థ‌ని బ‌ట్టి, పాత్ర‌ని బ‌ట్టి హీరోలు మార‌తార‌ని చెప్పుకొచ్చారు విజ‌య్‌.

మరో ప్రక్క ఈ చిత్రాన్ని మే 30వ తేదీ నుంచి జులై 4కు ‘కింగ్‌డమ్‌’ను వాయిదా వేసిన విషయాన్ని ఇప్పటికే చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ”మా ‘కింగ్‌డమ్‌’ను మే 30వ తేదీకే తీసుకు రావాలని ఎంతో ప్ర‌య‌త్నించాం. కానీ, ఇటీవల దేశంలో ఊహించని ఘటనలు జరిగాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రచారం చేయడం, ఈవెంట్స్ నిర్వహించడం సరికాదని వాయిదా వేశాం. జులై 4న చిత్రాన్ని విడుదల చేస్తాం” అని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పేర్కొంది.

, ,
You may also like
Latest Posts from