వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండ, మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. లైగర్, ఖుషి, ఫ్యామిలీ స్టార్ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరచడంతో ఆయన కెరీర్‌పై పెద్ద ఒత్తిడి వచ్చింది. అయితే ఈసారి భారీ బడ్జెట్‌తో, కొత్త కాన్సెప్ట్‌లో తెరకెక్కుతున్న చిత్రాన్ని ఎంచుకున్నారు.
విజయ్ దేవరకొండ ఎక్కువ సమయం వెచ్చించిన కింగ్‌డమ్ రిలీజ్ తర్వాత కాసేపు బ్రేక్ తీసుకున్నారు. ఈ మధ్యకాలంలో ఆయన కొత్త ప్రాజెక్ట్‌పై అనేక రకాల వార్తలు వినిపించాయి. పూజా కార్యక్రమం పూర్తయినా, బడ్జెట్ సమస్యలు, షెడ్యూల్ మార్పులు కారణంగా షూట్ వాయిదా పడింది. విజయ్ అమెరికా ట్రిప్ నుంచి తిరిగి వచ్చాక, చివరికి ఈ రోజు హైదరాబాద్‌లో షూట్ మొదలైంది.
ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాకు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వం వహిస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో, 19వ శతాబ్దంలో బ్రిటీష్ కాలంలో జరిగే కథగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. మే 9న విజయ్ బర్త్‌డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. రణభూమి అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.
హీరోయిన్‌గా రష్మిక మందన్నా నటిస్తుండగా, ఆమె తర్వాతి షెడ్యూల్ నుంచి జట్టులో చేరనుంది. టి సిరీస్, మైత్రీ మూవీ మేకర్స్ ఈ భారీ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. విజయ్ ఇప్పటికే బల్క్ డేట్స్ ఇచ్చి, షూట్‌ను వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. వచ్చే ఏడాది ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది.
వరస ఫెయిల్యూర్స్ తర్వాత విజయ్ తీసుకున్న ఈ భారీ రిస్క్ ఆయన కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందా అన్నది చూడాలి.