బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్‌పై జరిగిన దాడి కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. అయితే సైఫ్‌ని ఇంకా ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేయలేదు. అయితే ఈ దాడి సహా తదనంతర పరిణామాలపై కొన్ని మీడియా ఛానల్స్ చేస్తున్న ప్రసారాలను కరీనా కపూర్ ఖండించారు. సదరు వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఓ రిక్వెస్ట్ చేశారు.
ఆ ఘటనకు సంబంధించి ఓ ఛానల్ సృష్టించిన వీడియోను ఓ నటుడు సోషల్ మీడియాలో షేర్ చేయగా ఆమె రియాక్ట్ అయ్యారు.
ఈ వీడియోని కరీనా కపూర్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేస్తూ “ఇలాంటివి ఇప్పుడే ఆపేయండి.. మీకు అసలు హృదయం ఉందా..? దయచేసి మమ్మల్ని ఒంటరిగా వదిలేయండి” అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కొన్ని క్షణాల్లోనే ఆమె దాన్ని డిలీట్ చేయడం గమనార్హం.
సంబంధిత వీడియోలో.. సైఫ్ ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు బొమ్మలు తీసుకెళ్తూ కనిపించారు.
మీడియా వర్గాలు, ఫ్రీలాన్సర్లు సంయమనం పాటించాలని, ఊహాజనిత కథనాలు, కవరేజీకి దూరంగా ఉండాలంటూ తమ ఇంట్లో ఘటన చోటుచేసుకున్న రోజే ఆమె రిక్వెస్ట్ చేశారు.
అది తమకెంతో కఠినమైన రోజు అని, ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఆ ఘటన నుంచి తేరుకునేందుకు వీలుగా మా కుటుంబానికి కొంత సమయం ఇవ్వాలని కోరారు.