ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి సంచలన విజయాన్ని నమోదు చేసిన సినిమా ‘కాంతార’ (Kantara). బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లు క్రాస్ చేసింది. ప్రేక్షకుల నుంచే కాకుండా విమర్శకుల ప్రశంసలు కూడా పొందింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించగా.. కిషోర్, అచ్యుత్ కుమార్, సప్తమి గౌడ, ప్రమోద్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించారు. ‘కాంతార’ సినిమాకు అజనీష్ బీ లోక్‌నాథ్ సంగీతం అందించారు. ఇప్పుడు అలాంటి మరో సినిమా రాబోతోందా అంటే అవును అని వినిపిస్తోంది.
కర్ణాటక, కేరళలోని కరావళి (తులునాడు) ప్రాంతంలో పూజింపబడే ప్రధాన దేవత కొరగజ్జ చుట్టూ అల్లుకున్న కథతో రూపొందిస్తున్న బహుభాషా చిత్రం ‘కొరగజ్జ’. సుధీర్ అత్తవర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గోపీసుందర్ స్వరాల్ని సమకూర్చుతున్నారు.
‘కాంతార’ కంటే భిన్నమైన చిత్రమిదని, 800 ఏళ్ల క్రితం నాటి గిరిజనుల సంబంధిత దేవుడి కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని దర్శకుడు సుధీర్ అత్తవర్ తెలిపారు. కబీర్‌బేడి, సందీప్ సోపార్కర్, శృతి, భవ్య తదితరులు నటించిన ఈ కన్నడ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది.
సుధీర్ అత్తవర్‌తో కలిసి పనిచేస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ ఈ ప్రాజెక్ట్‌ను ఓ ప్రత్యేక అనుభవంగా చెబుతున్నారు. ఈ చిత్రంతో తాను మ్యూజిక్‌లో సరికొత్త ప్రయోగాల్ని చేశానని తన వర్క్ ఎక్స్‌పీరియెన్స్ గురించి పంచుకున్నారు.
‘ఈ చిత్రానికి సంగీతం కంపోజ్ చేయడానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి వచ్చింది. సంగీతంలో కొత్త ప్రయోగాల్ని చేయాల్సి వచ్చింది. గత చరిత్రను తెలుసుకోవాల్సి వచ్చింది. అందుకే కాస్త ఎక్కువ సమయం పట్టింది. నాటి ఆచారాలను, సంప్రదాయాల్ని అర్థం చేసుకున్న తర్వాత నాకు ఈ ట్యూన్స్ వచ్చాయి.
దర్శకుడికి నా పని నచ్చినందుకు, నేను ఇచ్చిన మ్యూజిక్ నచ్చినందుకు సంతోషంగా ఉంది. ‘కొరగజ్జ’ కథాంశం కొత్త సంగీతాన్ని అన్వేషించడానికి, కొత్త శైలిని కనిపెట్టడానికి నాకు వీలు కల్పించింది. ఈ చిత్రం నాకు ఎంతో సవాలుగా అనిపించింది’ అని అన్నారు.