తమిళ యాక్షన్ హీరో విశాల్ ఆరోగ్యంపై మరోసారి కలవరం కలిగించే ఘటన చోటుచేసుకుంది. మే 11, 2025న విల్లుపురంలో జరిగిన “మిస్ కువాగం ట్రాన్స్‌జెండర్ బ్యూటీ కాంటెస్ట్” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాల్, అకస్మాత్తుగా వేదికపై స్పృహ కోల్పోయి కిందపడిపోయారు.
తక్షణమే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, ప్రాథమిక చికిత్స అనంతరం విశాల్ పూర్తిగా కోలుకున్నట్లు సమాచారం. అర్ధగంట విశ్రాంతి తర్వాత ఆయన మళ్లీ కార్యక్రమానికి వచ్చారని నిర్వాహకులు తెలిపారు.
ఈ విషయంపై స్పందించిన విశాల్ మేనేజర్ హరి, “ఆ మధ్యాహ్నం విశాల్ తినలేకపోయాడు, కేవలం జ్యూస్ మాత్రమే తీసుకున్నాడు. ఆ తలనొప్పి, అలసట వల్లే స్పృహ కోల్పోయాడు. ఇప్పుడు ఆయన బాగానే ఉన్నారు. వైద్యులు అతడిని పూర్తిగా పరీక్షించి విశ్రాంతి సూచించారు,” అని వెల్లడించారు.
ఇది విశాల్‌కు ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఓ ఈవెంట్ సందర్భంగా ఆయన వేదికపై నిస్సత్తువగా కనిపించగా, ఆ సమయంలో తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నట్టు తెలుస్తుంది. అయినా ఆయన అభిమానులను నిరాశపరచకుండా స్టేజ్ మీదకు వచ్చారు.
తన శరీరాన్ని వదిలిపెట్టి కూడా పని పట్ల నిజమైన నిబద్ధత చూపిస్తున్న విశాల్‌ను చూసి ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. “ఆరోగ్యమే అసలైన హీరోయిజం” అంటూ ఆయన త్వరగా పూర్తిగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.