టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) మరోసారి తన విలక్షణ శైలిలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన, సినిమాల్లో అసభ్య పదజాలం, సెన్సార్ బోర్డు విధానాలపై గట్టిగానే స్పందించారు.
“ఇప్పుడు ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ ఉంది. అందులో పోర్న్ వీడియోలు, హింసాత్మక కంటెంట్ అన్నీ సులభంగా అందుబాటులో ఉన్నాయి. అలాంటప్పుడు, సినిమాల్లో మాత్రం బూతులు, కొన్ని రకాలు చూపకూడదని నియమాలు పెట్టడమేంటి? ఫోన్‌లో చూసేవి మానవ సంబంధాలపై ప్రభావం చూపవా? పెద్ద తెరపై మాత్రమే తప్పేంటి?” అంటూ వర్మ ప్రశ్నించారు.
అంతటితో ఆగకుండా, సెన్సార్ బోర్డుపై ఘాటుగా విమర్శలు చేస్తూ—
“సెన్సార్ బోర్డు అనేది ఇప్పటికే చరిత్రపుటల్లోకి వెళ్లిపోయింది. ఇప్పటికీ దాన్ని కొనసాగించడం స్టుపిడ్. ఇవి ఇప్పుడు పనికిరాని వ్యవస్థలు” అంటూ సూటిగా తిట్టేశారు.
సినిమాల్లో తాను స్వేచ్ఛను నమ్ముతానని, వినోదాన్ని నియంత్రించాలనుకోవడం స్వేచ్ఛపై దాడి అని వర్మ స్పష్టం చేశారు. ఇప్పటికే పలు వివాదాస్పద వ్యాఖ్యలతో పాపులర్ అయిన ఆర్జీవీ, ఈసారి మాత్రం నేరుగా సెన్సార్ వ్యవస్థనే లక్ష్యంగా చేసుకోవడం గమనార్హం. ఈ వ్యాఖ్యలపై సెన్సార్ బోర్డు ఎలా స్పందిస్తుందో చూడాల్సిందే.