రామ్‌ చరణ్‌ (Ram Charan) తాజా చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game changer).ఈ చిత్రం థియేటర్లలో ప్రదర్శితమవుతుండగానే దాదాపు 45 మంది వ్యక్తుల బృందం ఈ చిత్రం పైర‌సీ వెర్షన్‌ను ఆన్‌లైన్‌లో లీక్ చేసింది. దీంతో చిత్ర బృందం వెంటనే సైబర్ క్రైమ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. మరోవైపు ఏపీ లోకల్ టీవీ అనే టీవీ ఛానల్ ఆంధ్రప్రదేశ్‌లో పైరేటెడ్ సినిమా వెర్షన్‌ను చట్టవిరుద్ధంగా ప్రసారం చేసింది.

దీంతో మేనేజింగ్ డైరెక్టర్ హెచ్‌.వి. చలపతి రాజు నేతృత్వంలోని M/S కాపీరైట్ సేఫ్టీ సిస్టమ్స్, విశాఖపట్నం కమిషనరేట్ పరిధిలోని గాజువాక పోలీసులు, క్రైమ్ క్లూస్ టీమ్‌తో కలిసి రంగంలోకి దిగింది.

గేమ్ ఛేంజర్ పైరేటెడ్ వెర్షన్‌ను ప్రసారం చేసిన అప్పల రాజు ప్రాతినిధ్యం వహిస్తున్న ఏపీ లోకల్ టీవీ కార్యాల‌యంపై సంయుక్తంగా దాడి నిర్వ‌హించారు. కార్యాల‌యంలోని అన్ని పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. టీవీ ఛాన‌ల్ సిబ్బందిపై ఎఫ్ఐఆర్‌ నమోదు చేసి, అరెస్టు చేశారు.

‘గేమ్‌ ఛేంజర్‌’ చిత్రాన్ని తమ ప్రాంతంలోని లోకల్‌ ఛానల్‌లో ప్రసారం చేస్తున్నారని పేర్కొంటూ ఇటీవల ఒక నెటిజన్‌ సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌ పెట్టాడు. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను కూడా షేర్‌ చేశాడు.

దీనిపై సినీ ప్రముఖులు, ప్రియులు ఆగ్రహం వ్యక్తంచేశారు. సినిమా వెనక కొన్ని వేల మంది శ్రమ దాగి ఉంటుందన్నారు. పైరసీ కాపీని ప్రదర్శించడం మంచి పద్ధతి కాదని, దీనివల్ల ఎంతోమంది నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.

పొలిటికల్‌ యాక్షన్‌ ఫిల్మ్‌గా ‘గేమ్‌ ఛేంజర్‌’ రూపుదిద్దుకుంది. కియారా అడ్వాణీ హీరోయిన్. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు దీనిని నిర్మించారు. ఎన్నో అంచనాల మధ్య జనవరి 10న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

తాము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer) సినిమాని లీక్‌ చేస్తామంటూ బెదిరించిన వారిపై చిత్రబృందం సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదుచేసిన విషయం తెలిసిందే.

, ,
You may also like
Latest Posts from