సినిమా వాళ్లకు చాలా మందికి రివ్యూ రైటర్స్ పై కోపం ఉంటుంది. వారే సినిమాని చంపేస్తున్నారని అంటూంటారు. ఇప్పుడు జ్యోతిక కూడా అదే మొదలెట్టింది. తన సెకండ్ ఇన్నింగ్స్ లో అనేక బాలీవుడ్ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న జ్యోతిక.. తాజాగా ‘డబ్బా కార్టెల్’ అనే వెబ్ సిరీస్‌లో నటించింది. ఆ సిరీస్ ప్రమోషన్స్ సమయంలో తన భర్త సూర్య నటించిన ‘కంగువా’ డిశాస్టర్‌పై జ్యోతిక (Jyothika) స్పందిస్తూ రివ్యూలు కారణమని తేల్చేసింది.
జ్యోతిక మాట్లాడుతూ…‘‘కంగువాపై నెగిటివ్ రివ్యూలు చూస్తుంటే నాకు సర్‌ప్రైజింగ్‌గా అనిపిస్తోంది. అమ్మాయిలను ఏడిపిస్తూ, ఔట్‌డేటెడ్ స్టోరీలతో తెరకెక్కిన, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఉన్న, పిచ్చి యాక్షన్ సీన్స్‌తో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఎన్నో సినిమాలకు వారు పాజిటివ్ రివ్యూలు ఇవ్వడం చూశాను.
మరి కంగువాలో పాజిటివ్స్ గురించి ఏమైంది? రివ్యూ చేసేటప్పుడు మంచి విషయాలు చూడడం మర్చిపోయినట్టున్నారు. అసలు ఈ రివ్యూలను నమ్మాలా వద్దా అని నాలో అనుమానం మొదలయ్యింది. కంగువాపై మొదటిరోజే ఇంత నెగిటివిటీ చూపించడం చూస్తుంటే బాధేస్తోంది’’ అంటూ అప్పట్లోనే రివ్యూలపై తన కోపాన్ని బయటపెట్టింది జ్యోతిక.
అలాగే ‘‘సౌత్‌లో చెత్తగా తెరకెక్కిన ఎన్నో కమర్షియల్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యి, ఎక్కువ రేటింగ్ సంపాదించుకోవడం నేను చూశాను. కానీ నా భర్త సినిమాకు వచ్చేసరికి మరీ విచక్షణ లేకుండా రివ్యూలు ఇచ్చారు అని నాకు అనిపించింది.
కొన్ని సీన్స్ బాలేకపోవచ్చు కానీ అది చేయడానికి ఎంతో కష్టపడ్డారు. అది కూడా ఒక డిఫరెంట్ మూవీ. కానీ అంత ఘోరమైన రివ్యూలు చూసినప్పుడు మీడియాపై నాకు కోపం వచ్చింది’’ అని చెప్పుకొచ్చింది జ్యోతిక.
సూర్య నటించిన ‘కంగువా’ సినిమాను జ్యోతిక సపోర్ట్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. సినిమా విడుదలయ్యి నెగిటివ్ రివ్యూలు అందుకున్న వెంటనే వాటిని ఖండిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ కూడా షేర్ చేసింది జ్యోతిక.