సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ వైజయంతి (విజయ శాంతి) కి తన కొడుకు అర్జున్ (కళ్యాణ్ రామ్) తనదారిలోనే ప్రయాణం చేసి, నిజాయితీగల పోలీస్ అవ్వాలని కోరిక. కానీ అర్జున్ పూర్తిగా విభిన్నమైన దారి ఎంచుకున్నాడు. వైజాగ్ లో పెద్ద గ్యాంగస్టర్ గా సెటిల్ అయ్యాడు. అయితే అతనికి తల్లి అంటే ప్రాణం. తల్లిపై ఈగ వాల నివ్వడు.
అలాంటిది పఠాన్ (సోహైల్ ఖాన్) అనే ముంబై గ్యాంగ్ స్టర్ తన తల్లిపై పగ పట్టి అంతమొందించడానికి సిద్దంగా ఉన్నాడని తెలిస్తే ఊరుకుంటాడా. అదే సమయంలో అతని తల్లి తన కొడుకు ఆ క్రిమినల్ మార్గం వీడి, పోలీస్ లకు లొంగిపోవాలని కోరుకుంటుంది. అప్పుడు ఏమైంది. తల్లి చెప్పింది కొడుకు విన్నాడా, తల్లిని విలన్స్ నుంచి ఎలా రక్షించుకున్నాడు, చివరకు ఏమైంది అనేది తెరపై చూడదగ్గ కథ.
ఎలా ఉంది
కొన్ని కాంబినేషన్స్ చెప్పుకోవటానికి బాగుంటాయి. క్రేజ్ తీసుకువస్తాయి, కానీ వాటిని తెరపై అంతే ఇంటెన్స్ తో ప్రభావవంతంగా ప్రెజెంట్ చేయకపోతే ఫెయిల్ అవుతాయి. ఈ సినిమాకు విజయశాంతి, కళ్యాణ్ రామ్ ఇద్దరి కాంబినేషన్ వినటానికి బాగున్నా, వారిని కలిపి తెరపై అద్బుతమైన డ్రామా క్రియేట్ చేయటానికి తగిన కథ లేకుండా పోయింది. సినిమా చూస్తుంటే పది,పదిహేను పాత కాలం సినిమాలు గుర్తుకు వస్తున్నాయంటే అర్దం చేసుకోవాలి. డైరక్టర్ స్క్రిప్టుపై ఏ మాత్రం కసరత్తు చేసాడో.
ఇలాంటి కథ ఎంచుకున్నాడని కళ్యాణ్ రామ్ ని తప్పు పట్టడానికి ఏమీలేదు. దాదాపు కమర్షియల్ కథలు అన్ని ఇలాగే ఉంటున్నాయి. అయితే ఈ చెప్పే కథ 2025లో జరుగుతోందని గుర్తు పెట్టుకుంటే చాలు. అదే జరగలేదు. దాంతో ఏ సీన్ చూసినా ఎక్కడో చూసినట్లు, ట్విస్ట్ లు ఇంతకు ముందే తెలిసిపోయినట్లు అనిపిస్తాయి. చాలా ప్రెడిక్టబుల్ గా స్క్రీన్ ప్లే నడుస్తుంది. సినిమా చివర ఇరవై నిముషాలు తప్పించి ఎక్కడా ఆసక్తి అనేది క్రియేట్ చేయలేకపోయారు. అయితే అప్పటికే ప్రేక్షకుడు అలిసిపోయి ఉంటాడు.
ఎవరెలా చేసారు
సినిమాటోగ్రఫీ , అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కలిసి వచ్చింది. యాక్షన్ సీక్వెన్స్ లు బాగా డిజైన్ చేసారు.ఫస్టాఫ్ ఎడిటింగ్ స్పీడుగానే వెళ్లిపోయినా సెకండాఫ్ లో మరింత షార్ప్ గా ఉండాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.
కళ్యాణ్ రామ్, విజయశాంతి పోటీ పడి మరీ ఈ రొటీన్ కథను శక్తిమేరకు మోసి నిలబెట్టే ప్రయత్నం చేసారు. పృథ్వీ, బబ్లు, శ్రీకాంత్ వంటి వారు తమ పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు. శ్రీకాంత్ మళ్లీ నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఆకట్టుకున్నాడు.
చూడచ్చా
కొన్ని యాక్షన్ బ్లాక్ లు, చివర్లో ఓ చిన్న ట్విస్ట్ తప్పిస్తే సినిమాలో చెప్పుకునేందుకు ఏమీలేదు. మీరు కళ్యాణ్ రామ్ లేదా విజయశాంతి అభిమాని అయితే సినిమా నచ్చుతుంది. వీళ్లిద్దరి కోసం కాకపోతే కష్టమే.