తమిళ సూపర్‌స్టార్, టివికె పార్టీ అధ్యక్షుడు దళపతి విజయ్ పై కేసు నమోదైంది. మదురైలో జరిగిన విజయ్ మహాసభ సందర్భంగా ఆయన బౌన్సర్లు, బాడీగార్డులు తనపై దాడి చేశారంటూ శరత్‌కుమార్ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో, కున్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
ఫిర్యాదు ప్రకారం – విజయ్ జనసభలో లెక్కలేనన్ని అభిమానులు తరలివచ్చారు. ఆ సమయంలో విజయ్ నడుస్తున్న ర్యాంప్ ఎక్కడానికి ప్రయత్నించిన తనను బౌన్సర్లు తోసివేయగా, తీవ్రమైన గాయాలయ్యాయని శరత్‌కుమార్ ఆరోపించారు. ఛాతి గాయాలతో బాధపడుతున్నానని, ఈ ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు వెంటనే BNSS సంబంధిత సెక్షన్ల కింద విజయ్, ఆయన సెక్యూరిటీ సిబ్బందిపై కేసు నమోదు చేశారు.
ఇక విజయ్ అభిమానులు మాత్రం ఈ ఫిర్యాదు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపిస్తున్నారు. మదురై సభలో విజయ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం, సభకు లక్షలాదిగా ప్రజలు హాజరుకావడం పాలకులకు జీర్ణించలేకపోవడంతోనే ఇలాంటి అడ్డంకులు సృష్టిస్తున్నారని అభిమానులు చెబుతున్నారు.
ఇక విజయ్ సినిమా కెరీర్ విషయానికి వస్తే – ఆయన చివరి చిత్రం “జన నాయకన్” వచ్చే ఏడాది జనవరిలో విడుదల కానుంది. దాని తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పి, పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. 2026 ఎన్నికల్లో నేరుగా బరిలోకి దిగేందుకు విజయ్ సన్నాహాలు చేస్తున్నారు.